ఖమ్మం బ్రాండ్ ఇమేజ్ వుండేలా నగర సమగ్ర అభివృద్ధి జరగాలి : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
13.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఖమ్మం బ్రాండ్ ఇమేజ్ వుండేలా నగర సమగ్ర అభివృద్ధి జరగాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం మంత్రి ఖమ్మం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగర అభివృద్ధి పై కార్పొరేటర్లు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం నగరం. అందంగా, పరిశుభ్రంగా, అందరికి ఆమోదయోగ్యoగాఉండాలన్నారు. విద్య, వైద్యం, ప్రశాంతత ఉంటుందని అన్ని వర్గాలకు భరోసా కలగాలన్నారు. నగరానికి అండర్ గ్రౌండ్ డ్రయినేజి సాధిస్తానన్నారు. నగరంలో మంచి గాలి, సురక్షిత త్రాగునీరు, మంచి రోడ్లు, మంచి వాతావరణం కల్పించాలన్నారు. ఇండ్లు నిర్మించుకొని, ఇంకనూ ఇంటి నెంబర్లు లేని ఇండ్లకు నిబంధనల మేరకు ఇంటి నెంబర్లు ఇవ్వాలన్నారు. పనులకు అధికారులు వెంటనే స్పందించాలని, వారి పరిధిలోని పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన తెలిపారు. వర్షాకాలం కనుక శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోడ్లు, వీధులు పరిశుభ్రంగా వుండేలా చర్యలు తీసుకోవాలని, డ్రయినేజ్ లు ఎక్కడా బ్లాక్ కాకుండా, నీరు నిల్వకుండా వుండేలా చూడాలన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండ చూడాలని, పైప్ లైన్ లీకేజీలు ఉంటే, వెంటనే నియంత్రించాలని, సరఫరా సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. మీడియన్స్ లో, రోడ్ల కిరువైపుల మంచి మొక్కలు నాటాలని, మొక్కలు నాటేటప్పుడు పైన కరంట్ తీగలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా వుండేలా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. రోడ్ల వెడల్పుపై దృష్టి పెట్టాలన్నారు. రోడ్ల వెడల్పుతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రోడ్ల వెడల్పుకు ప్రజలను ఒప్పించాలన్నారు. వాహనాలు ఖమ్మం నగరంలోకి రాకుండా, హైదరాబాద్ తరహాలో అమరావతి- దేవరాంపల్లి రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామన్నారు. రోడ్లన్నీటికి సర్వీస్ రోడ్ల ఏర్పాట్లు చేస్తామన్నారు. వర్షాకాలం తర్వాత నగరంలో శాశ్వత పనులపై కార్యాచరణ చేయాలన్నారు. అసెంబ్లీ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటుచేసి, నగర అభివృద్ధికి చేయాల్సిన పనులకు కార్యరూపం తెస్తానన్నారు. ఈ మూడు నెలలు తాత్కాలిక ఏర్పాట్లతో ప్రజలకు త్రాగునీరు, విద్యుత్, శానిటేషన్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, నగర అభివృద్ధికి ప్రగతి ప్రణాళిక చేయాలన్నారు. ఆదాయం పెంపుకు ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి, వాణిజ్య, నీటి పన్నుల వసూలు వంద శాతం జరగాలన్నారు. టౌన్ ప్లానింగ్ ద్వారా లే అవుట్ అనుమతుల నుండి ఆదాయం పెంచుకోవాలన్నారు. అనుమతి లేకుండా, అనుమతుల విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై ముందస్తుగా హెచ్చరికలు చేస్తే, సర్దుబాటు చేసుకుంటారని కలెక్టర్ తెలిపారు. చెత్త సేకరణ సమర్థవంతంగా చేయాలన్నారు. ప్రజల సమస్యలపై స్పందించి, మెరుగైన సేవలు అందించాలన్నారు.
సమీక్ష లో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ, శానిటేషన్ ప్రణాళిక చేసినట్లు, వార్డుల వారిగా కార్పొరేటర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. ఏబిసి కేంద్రం ద్వారా త్వరలో కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జేసిబి, ట్రాక్టర్, పరికరాల మరమ్మత్తులు చేపట్టి, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు.
అంతకుముందు నగరపాలక సంస్థ కు మంత్రి హోదాలో వచ్చిన మంత్రిని మేయర్, కార్పొరేటర్లు సన్మానించారు.సమీక్షలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు, ఎలక్ట్రిసిటీ ఎస్ఇ సురేందర్, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, మునిసిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.














