తొలిసారి ప్రభుత్వం ఉత్తర్వులను తెలుగులో జారీ పట్ల తెలుగునాడు సమితి హర్షం
హైదరాబాద్ జూలై 16 (ఈతరం భారతం);ప్రభుత్వ ఉత్తర్వులు మొట్టమొదటిసారిగా తెలుగులో జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగునాడు సమితి అధ్యక్షులు గుమ్మడి హరిప్రసాద్ నేడొక ప్రకటనలో అభినందనలు తెలియజేశారు. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రైతు రుణమాఫీ మార్గదర్శకాలను ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రలో నిలిచి పోతుందని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా, పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలు తెలుగులో జారీ చేయాలని ఎప్పటినుంచో తెలుగు భాషాభిమానులు, తెలుగు భాష పరిరక్షణ సంఘాలు సూచిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం అని తెలిపారు. “ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు ప్రజలకు సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించిన సమాచారం ఉండాలని ఎప్పటినుంచో చెబుతున్నారు. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యతనిస్తూ, తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు కి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇక నుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని తెలుగునాడు సమితి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నది.














