మాయ మాటలతో రూ.15 కోట్లు మాయం….ముగ్గురి వృద్ధుల జీవితకాల కష్టం దోపిడీ
12.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
శేషజీవితంలో ప్రశాంతంగా ఉండేందుకు ముగ్గురు వృద్ధులు దశాబ్దాలపాటు కష్టపడి దాచుకున్న సొమ్మును సైబర్ నేరస్థులు మాయమాటలతో నిలువునా దోచేశారు.
ముగ్గురి ఖాతాల్లో నుంచి ఏకంగా రూ.15.78 కోట్లను కొట్టేశారు. ఇటీవల బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) కేసులు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది. అందులోని వివరాల మేరకు..
షేర్ల పేరిట రూ.5.98 కోట్లు బురిడీ
కూకట్పల్లి వసంత్‌నగర్‌కు చెందిన వ్యాపారి(63)కి గోల్డ్‌మన్ సాచ్ బిజినెస్ స్కూల్లో చేరాలంటూ జనవరి 23న వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. షేర్ల గురించి వివిధ నైపుణ్యాలు నేర్పిస్తామని అందులో పేర్కొన్నారు. అనంతరం సీత అనే మహిళ ఫోన్ చేసి.. తాను గోల్డ్‌మన్ కంపెనీ ఎండీ జైసహానీకి అసిస్టెంట్‌గా చెప్పుకొని వ్యాపారిని వాట్సప్ గ్రూప్‌లో చేర్చింది. యాపిల్ స్టోర్ నుంచి ‘జీఎస్ఐఎన్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేయించింది. అదే నెల 30 నుంచి వ్యాపారితో పలు విడతలుగా రూ.5.98 కోట్లను పెట్టుబడిగా పెట్టించారు. యాప్‌లో ఆ షేర్ల విలువ రూ.21 కోట్లుగా కనిపించేది. లాభాల్లో నుంచి కొంత మొత్తం ఉపసంహరించుకుంటానని వ్యాపారి సీతకు చెప్పారు. అందుకు లాభంలో 20 శాతం కింద రూ.2.88 కోట్లు చెల్లించాలని ఆమె మెలికపెట్టింది. ఇదే విషయమై వాట్సప్ గ్రూప్‌లోని ఇతర సభ్యులతో చర్చించేందుకు వ్యాపారి ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదు. చివరకు సీత కూడా అందుబాటులోకి రాకపోవడంతో బాధితుడు ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ట్రాన్స్‌కో విశ్రాంత సీఈ నుంచి రూ.4.82 కోట్ల లూటీ
నాచారంలో నివసించే టీఎస్ ట్రాన్స్‌కో విశ్రాంత సీఈ(75)కి జూన్ 13న ముంబయి టెలికాంశాఖ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీ పేరుతో ఉన్న సిమ్ నుంచి పలువురికి వేధింపు కాల్స్ వస్తుండటంతో కేసు నమోదైందని చెప్పాడు. తానెలాంటి సిమ్ తీసుకోలేదని వృద్ధుడు చెప్పగా.. ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ కాల్‌ను బదిలీ చేశాడు. ముంబయిలోని చెంబూర్ ఎస్సైగా పరిచయం చేసుకున్న మరో వ్యక్తి స్కైప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించాడు. తనకు స్కైప్ అకౌంట్ లేదని విశ్రాంత సీఈ చెప్పారు. అనంతరం ఐపీఎస్ అధికారినంటూ ఆకాశ్ కులహరి పేరుతో మరో వ్యక్తి వాట్సప్ వీడియోకాల్ మాట్లాడాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదైందని చెప్పాడు. తాను సూచించినట్లు చేస్తే తొందరగా కేసు మూసేస్తానని నమ్మించాడు. అలా వృద్ధుడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములతోపాటు మ్యూచువల్ ఫండ్లు, ఎఫ్డీలు, ఎల్ఐసీ బాండ్లు.. ఇలా అన్నింట్లో నుంచి డబ్బులు డ్రా చేయించి మొత్తం రూ.4.82 కోట్లను ఆర్టీజీఎస్ ద్వారా కాజేశాడు. ఇంకా డబ్బులు పంపాలంటూ ఫోన్లు చేస్తుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఇటీవలే సీఎస్‌బీకి ఫిర్యాదు చేశారు.
80 ఏళ్ల వృద్ధుడికి రూ.4.98 కోట్ల టోకరా
రామచంద్రాపురం భెల్ టౌన్షిప్ సమీపంలో నివసించే వృద్ధుడి(80)కి మే 19న సీబీఐ అధికారినంటూ కబీర్‌సింగ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. మీ ఆధార్ నంబరుతో సిమ్‌కార్డు తీసుకున్న నరేశ్‌గోయల్ మనీలాండరింగ్‌కు పాల్పడినందుకు సీబీఐ కేసు నమోదు చేసిందని చెప్పాడు. ఈ కేసు దేశభద్రతకు సంబంధించిన తీవ్ర నేరం కావడంతో జైలు శిక్ష తప్పదని భయపెట్టాడు. తాను తన జీవితకాల వేతనాన్ని వివిధ చోట్ల పెట్టుబడులు పెట్టి సంపాదించుకున్నానని, మనీలాండరింగ్‌కు పాల్పడ లేదని వృద్ధుడు ఆందోళనపడుతూ చెప్పారు. అయితే దర్యాప్తును వీలైనంత తొందరగా ముగించేందుకు వీడియోకాల్‌లో మాట్లాడాలని కబీర్‌సింగ్ సూచించాడు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇంట్లో ఎవరితోనూ విషయం పంచుకోవద్దని, ప్రత్యేక గదిలో కాల్ మాట్లాడాలని షరతు పెట్టాడు. అదేవిధంగా వృద్ధుడు వాట్సప్ వీడియోకాల్ చేయగా.. కేసుకు సంబంధించినవంటూ పలు పత్రాలు చూపించి మరింత భయాందోళనకు గురిచేశాడు. సుప్రీంకోర్టు పరిశీలన కోసం మీ వద్ద ఉన్న డబ్బునంతా తాము సూచించిన ఖాతాలకు ఆర్టీజీఎస్ ద్వారా పంపాలని చెప్పాడు. ఒకవేళ మనీలాండరింగ్‌తో సంబంధం లేదని తేలితే తిరిగి ఇచ్చేయడంతోపాటు కేసు మూసేస్తామని చెప్పాడు. నిజమేనని నమ్మిన వృద్ధుడు మే 20 నుంచి జూన్ 20 వరకు పలు విడతలుగా మొత్తం రూ.4,98,75,000 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. నెలన్నర గడుస్తున్నా డబ్బు తిరిగి రాకపోవడంతో వృద్ధుడు విషయాన్ని తన అల్లుడికి చెప్పాడు. అదంతా మోసమని ఆయన చెప్పడంతో నాలుగు రోజుల క్రితం సీఎస్‌బీకి ఫిర్యాదు చేశారు. అయితే గత నెల 26న ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నానంటూ మరో వ్యక్తి కూడా అదే వృద్ధుడికి ఫోన్ చేసి మీ పేరిట ఉన్న సిమ్‌కార్డు నుంచి పలువురికి వేధింపు కాల్స్ వెళ్తున్నాయని చెప్పాడు. వృద్ధుడు ఈ విషయాన్ని కబీర్సింగ్కు చెప్పగా అలాంటి కాల్స్‌ను నమ్మవద్దని చెప్పడం గమనార్హం.














