EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 15

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన ప్రజాపాలన‌‌ – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు. 99 రోజుల పాటు రాష్ట్రమంతటా జరిగిన కార్యక్రమాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  సమీక్ష సమావేశం నిర్వహించారు.

విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్ గారితో పాటు , వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు చేపట్టిన కార్యక్రమాల వివరాలపై నివేదికలను సమర్పించాయి.

99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చురుగ్గా పాల్గొన్న విభాగాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు. ప్రధాన కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతినెలా క్షేత్రస్థాయికి వెళ్లాలని గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని అధికారులు, జిల్లా కలెక్టర్లపై తనకు నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీని సీఎం ఆదేశించారు.  వివిధ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ను నమోదు చేయాలని, గ్రామాల్లో వచ్చిన సమస్యలను కూడా ఆయా శాఖలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ 3 నెలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, చేసిన శంకుస్థాపనలు, ఆస్తుల వివరాలన్నీ నమోదు చేయాలని చెప్పారు.

ఇప్పటికీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలుంటే.. వెంటనే ఆ జాబితాను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అక్కడ కొత్తగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను కూడా చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.  విద్యా, వైద్య విభాగాల్లో అన్ని స్థాయిల్లో ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి కాలేజీల వరకు, పీహెచ్‌సీ నుంచి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వరకు ఉద్యోగులందరికీ ఇదే అటెండన్స్ విధానం పాటించాలన్నారు.

రాష్ట్రస్థాయిలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించినట్లే, జిల్లాల వారీగా వెంటనే సమీక్ష జరపాలని ఆదేశించారు. ఈ సమీక్షలకు రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించి, ఆ జిల్లాకు పంపించాలని చెప్పారు. జిల్లాల వారీగా ఈ ప్రగతి నివేదికలను విడుదల చేయాలని చెప్పారు. జిల్లాలతో పాటు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుకున్న లబ్ధిదారులు, ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిని డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంచాలని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి  అధికారులను ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి హామీల పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రణాళికా విభాగాన్ని ఆదేశించారు.

Related News

Select the Topic
Scroll to Top