EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆకట్టుకున్న సినారె మానవతా కవితా గానం 

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 25 :జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డి మానవతా కవితా గానం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాయకుడు దేవత సుధాకర్ మహాకవి సినారె మానవత్వం వెల్లివిరిసేలా రచించిన పలు పద్యాలు, గజళ్లు, ద్విపదులు, ప్రపంచపదులు, లలిత, జానపద, సినీ, దేశభక్తి గీతాలను హృద్యంగా ఆలపించారు. కవితాగాన లహరికి గురు ప్రసాద్, సతీష్, జయ కుమారాచార్య, లింగా శ్రీనివాస్ అత్యద్భుతంగా వాద్య సహకారాన్ని అందించారు. తొలుత సినారె చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసినా సినారె లోని అంతర్లీన లయ మానవత్వమేనని చెప్పారు. సినారె రాసిన ఎన్నో సినీ గీతాలలో మానవతా సందేశమే ప్రధాన భూమికగా సాగి ఆకట్టుకుందని తెలిపారు. భిన్న ప్రక్రియలలో మానవతా అంశాలను ఎంపిక చేసుకుని ఆకట్టుకునేలా గానం చేసిన సుధాకర్ ను ఆయన అభినందించారు. సిరిసిల్లకు చెందిన సుధాకర్ అదే ప్రాంతం నుండి విశ్వ మహాకవిగా ఎదిగిన సినారెకు స్వర నీరాజనాన్ని శిష్య భక్తితో అర్పించడం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెప్పారు. సినారె కుమార్తెలు గంగ, సరస్వతి, ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దక్షిణామూర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య తో పాటు అనేకమంది ప్రముఖులు, కవులు, గాయకులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top