హైదరాబాద్ జూలై 31 (ఈతరం భారతం);కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 2 ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించే మహా ధర్నాకు బీసీలందరూ వేలాదిగా తరలిరావాలని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగంటి రాజు నేత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా బీసీలను మోసాలకు గురి చేస్తుందని కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను ఇప్పటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని రాజునేత ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా హలో బిసి చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం బీసీలందరూ సమాయత్తం కావాలని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి బీసీ ఒక సైనికుడి వలె యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీసీలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రతి ఏడాది 20 వేల కోట్లు కేటాయిస్తాము ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క హామీని బీసీలకు నెరవేర్చలేదని అన్నారు. కులవృత్తులను ప్రోత్సహించే పథకాలకు సబ్సిడీ కింద రుణాలను ఇచ్చే పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గండి కొట్టిందని తెలిపారు. 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడి వేటాడుతామని అన్నారు ముస్లింలను 10 శాతం జనాభాగా చూపించి 42% రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇచ్చే కుట్ర జరుగుతుందని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని రాజు నేత అన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాలలో సమానమైన వాటా దక్కేవరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా సాధించేవరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక బీసీగా ఉన్న నరేంద్ర మోడీ గారు బీసీల అందరికీ పెద్దన్న పాత్ర పోషిస్తూ గత 11 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, బీసీలను ఆదుకునే ఏకైక ప్రభుత్వం బిజెపి పార్టీని అని తెలిపారు. కాబట్టి బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ వైపే ముగ్గు చూపుతున్నారని రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వమే అని అన్నారు.















