ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 1:
ఈహెచ్ఎస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల నుండి ఒకటిన్నర శాతం చందా వసూలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల స్టేట్ జాయింట్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ తిరుగతం ప్రభాకర్ కన్వీనర్ సయ్యద్ షౌకత్ అలీ, కో- కన్వీనర్లు ఎస్ దేవేందర్, బత్తుల మురళిధర్ గౌడ్, టి హరి కిషన్ తెలిపారు. సోమవారం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల జాయింట్ స్ట్రగుల్ కమిటీ సమావేశం రాష్ట్ర సమావేశం కమిటీ చైర్మన్ టి ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయం జరిగింది ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని మెజారిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్లు ఎవరు కూడా ఈ హెచ్ ఎస్ చందా ఇవ్వడానికి సుముఖంగా లేరని, ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని వారు తెలిపారు. కేవలం నాయకులుగా చలామణి అవుతున్న కొందరు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాన్ని సార్వజనికం చేయడం అసమంజసమని వారు ఆక్షేపించారు. ఈహెచ్ఎస్ పై పూర్తి స్థాయిలో చర్చ లేకుండా కేవలం నాయకులుగా చలామణి అవుతున్న కొందరు వ్యక్తుల సమ్మతి అని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వర్గాల మనోభావాలకు విరుద్ధంగా, ఉద్యోగుల వాటాగా ఒకటిన్నర శాతం చందా మినహించడం ప్రభుత్వపరంగా జరిగిన పెద్ద పొరపాటని, దానికి ఉద్యోగ వర్గాల నుండి వ్యక్తమవుతున్న వ్యతిరేకతే నిదర్శనమని వారు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 2006 సంవత్సరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటీని పునరుద్ధరణ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని, త్వరలో భావసారుప్యం గల అన్ని సంఘాలతో చర్చించి, విస్తృత సమావేశం ఏర్పాటు చేసి, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక మరియు పెన్షనర్ల మనోభావాలు కనుగుణంగా విస్తృత కార్యవర్గం ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. జేఏసీ అంటే ఉద్యోగుల ఆకాంక్షలకు ప్రతిరూపమని, దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జేఏసీలు అంటే కేవలం భజన సంఘాలుగా, పాలాభిషేకాలు చేసే సంస్థలుగా స్వార్థపరులు తయారు చేశారని, ఇది అత్యంత విచారకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ, నేతలుగా చెలామణి అవుతున్న వ్యక్తులు ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేయడంలో ఘోరంగా వైఫల్యం చెందడం వల్లనే, నేడు రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వానికి ఎప్పుడూ లేనంతగా అగాధం ఏర్పడిందని, దానిని సరైన నాయకత్వం ద్వారా పూర్తిగా తొలగించి, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వానికి వాస్తవ రూపంలో తెలియజేయడం ద్వారా సమస్యలను అధిగమిస్తామని వారు తెలిపారు. ఈహెచ్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు వైఖరి అవలంబించవద్దని, ఇది భవిష్యత్తు తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, ప్రభుత్వం పట్ల ఉద్యోగుల వ్యతిరేకతను తారాస్థాయికి తీసుకుని పోతుందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి మెజారిటీ ఉద్యోగుల మనోభావాలను గౌరవించి ఈ హెచ్ ఎస్ చందా మినహించడాన్ని ఉపసంహరించుకోవాలని నేతలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.














