ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 24
__________________________________
ట్యాంక్ బండ్ గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ మార్గ్‌లో అత్యంత అంకితభావంతో విధులు నిర్వర్తిస్తుండగా, గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొన్న దుర్ఘటనలో కొత్తగూడెం టూ-టౌన్ ఎస్సై కె.వెంకన్న తీవ్రంగా గాయపడ్డారు.సహచర సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రజల భద్రత కోసం శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రేయింబవళ్లు శ్రమిస్తూ, కర్తవ్య నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోవడం తెలంగాణ పోలీస్ శాఖకు తీరని లోటని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంతాపం ప్రకటించారు. ఎస్సై వెంకన్న అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పెను విషాద సమయంలో బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ అన్ని విధాలా సంపూర్ణంగా అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి అధికారి ప్రాణాలు తీసిన నిందితుడిని గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అమరుడైన ఎస్సై వెంకన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.















