EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కవిత్వాన్ని ప్రేమిస్తే శిఖర స్థాయికి చేరుకోవచ్చు

ఈతరం భారతం ఓయూ  క్యాంపస్ హైదరాబాద్, ఏప్రిల్ 28

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి డా. నందిని సిధారెడ్డి అభినందన సభ నిర్వహించారు. విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డా. ఎస్. రఘు మాట్లాడుతూ ఈ తెలుగు శాఖలో చదువుకున్న సిధారెడ్డి బహుముఖీనంగా కృషి చేస్తూ నేటి తరానికి స్ఫూర్తి పతాకగా నిలవడంఅభినందనీయమన్నారు. నందిని సిధారెడ్డి కవిత్వంలోని సామాజిక చైతన్యం, భాషా సౌందర్యం, ప్రజా జీవన అనుబంధాన్ని ప్రశంసించారు.తెలుగు శాఖ అధ్యక్షులు డా. ఏలె విజయలక్ష్మి నందిని సిధారెడ్డి సాహిత్య ప్రస్థానాన్ని పరిచయం చేస్తూ, ఆయన రచనల్లో ప్రతిఫలించిన తెలంగాణ భావజాలం, ప్రజా జీవన వాస్తవాలు, సామాజిక స్పృహ గురించి విశదీకరించారు. ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన “అనిమేష” కావ్యంలోని భావసంపదను ప్రస్తావిస్తూ ఆ కావ్యం ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.’అనిమేష’ కావ్యాన్ని ప్రముఖ విమర్శకులు డా. బెల్లంకొండ సంపత్ కుమార్ సమగ్రంగా విశ్లేషించారు. కవిత్వం పుట్టుక, కవి అంతర్ముఖ అనుభూతులు, కరోనా కాలంలో సమాజం ఎదుర్కొన్న సంక్షోభాలు వంటి అంశాలను ఆయన విశ్లేషణలో వివరించారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన వైద్యుల సేవలను ప్రశంసిస్తూ, అదే సమయంలో మానవత్వాన్ని మరిచి వ్యాపార ధోరణితో వ్యవహరించిన కొంతమంది మనుషుల వైఖరిని కవి ఎలా ప్రశ్నించారో వివరించారు. ప్రకృతి, భూమి, మనిషి మధ్య ఉన్న సంబంధాన్ని “అనిమేష” కావ్యం లోతుగా ఆవిష్కరించిందని తెలిపారు.ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ ఆచార్య ఎం. లింగప్ప నందిని సిధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలుగుసాహిత్యానికి గౌరవకారణమని అభినందనలు తెలిపారు. “అనిమేష” అనే శీర్షికలో అంతర్లీనంగా ఉన్న తాత్విక భావనలను కూడా వివరించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి. కాశీం గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో నందిని సిధారెడ్డి తో కలిసి సాగిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆయన సాహిత్యంలో ప్రతిఫలించిన సామాజిక విలువలు, శైలి, ప్రజా చైతన్యం గురించి వివరించారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రపంచ దేశాలు అనుసరించిన వైఖరిని ప్రస్తావిస్తూ, “అనిమేష”లో అమెరికా ఉదాసీనతపై కవి చేసిన వ్యాఖ్యానాన్ని విశ్లేషించారు. కావ్యంలో ఉన్న కొన్ని కవితలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాటి అంతరార్థాన్ని వివరించారు.

ఈ సభలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులతో ప్రత్యేక కవితా పఠనం నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను అభినందిస్తూ, పాల్గొన్న వారందరికీ నందిని సిధారెడ్డి రచనలతో పాటు ఇతర సాహిత్య పుస్తకాలు, ప్రశంసా పత్రాలను ఉస్మానియా తెలుగు శాఖ తరఫున నందిని సిధారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఉస్మానియా తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం సమకాలీన తెలుగు కవిత్వానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. “అనిమేష” కవిత్వాన్ని “ఆధునిక నవదశ గాథాలహరి”గా అభివర్ణించారు. కవిత్వ లక్షణాలు, పౌరాణిక చరిత్రలో మహమ్మారుల ప్రస్తావనలు, సిధారెడ్డి వ్యక్తిత్వం, రచనా శైలి గురించి విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. చివరగా మాట్లాడిన డా. నందిని సిధారెడ్డి ఈ అభినందన సభ తన జీవితంలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. తాను గణితశాస్త్రాన్ని వదిలి సాహిత్యాన్ని ఎంచుకోవడానికి ఆచార్య సి. నారాయణరెడ్డి ప్రభావమే కారణమని తెలిపారు. విద్యార్థి దశలోనే కవిత్వంపై ప్రేమ పెరిగిందని, ఆ ప్రేమే తనను ఉన్నత శిఖరాలకు చేర్చిందని పేర్కొన్నారు. విద్యార్థులు కవిత్వాన్ని ప్రేమించాలని, పురస్కారాల కోసం కాకుండా అంతర్ముఖ అనుభూతి కోసం సాహిత్యం సృష్టించాలని సూచించారు.

‘అనిమేష” కావ్యం కరోనా లాక్‌డౌన్ సమయంలో రచించానని తెలిపారు. “బంధారం కథలు”, “నాగటి తరం” నవల వెనుక తన తండ్రి కష్టాలు, గ్రామీణ జీవితం, స్నేహితుల సహకారం ఉన్నాయని భావోద్వేగంతో వివరించారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్న రోజుల్లో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, స్నేహితుల సహాయం గురించి గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్ రావడానికి కూడా డబ్బులు లేని తనే, తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే స్థాయికి చేరుకోవడం అక్షరాన్ని ప్రేమించడం వల్లేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డా. నాళేశ్వరం శంకరం, డా. బాణాల శ్రీనివాసరావు, కందుకూరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల కవితా పఠనంలో రాహుల్, శ్రీశైలం, రాంబాబు,శ్రావణి లు ప్రత్యేక బహుమతి అందుకున్నారు.

Related News

Select the Topic
Scroll to Top