ఈతరం భారతం హైద్రాబాద్ ఫిబ్రవరి 13
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన ఫలితాల మేరకు 83 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్ల ను కాంగ్రెస్ పార్టీ అజేయంగా కైవసం చేసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.గాంధీ భవన్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మాట్లాడారు.
ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది మా స్థానాలు మరిన్ని పెరుగుతాయి అన్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీల వారు మాతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు చివరకు మొత్తంగా 116 మున్సిపాలిటీలకు గాను 90 నుంచి 94 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో జమ అవుతాయని స్పష్టం చేశారు. ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధించింది మరో రెండు చోట్ల హంగ్ ఏర్పడింది అన్నారు. అక్కడ బిజెపి, కాంగ్రెస్, ఇండిపెండెంట్ లు ఉన్నారు, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అన్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మున్సిపల్ స్థానాలు రావడం సంతోషం కలిగించే విషయం అన్నారు. అభివృద్ధి ,సంక్షేమం విశ్వసనీయతకు రాష్ట్ర ప్రజలు పెద్దపీటవేశారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని ఈ ఫలితాలతో తేటతెల్లమైందని డిప్యూటీ సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని బిఆర్ఎస్, బిజెపి నేతలు ప్రతిరోజు గాలి కబుర్లు చెబుతూ కట్టు కథలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్న విమర్శలను గమనించి రాష్ట్ర ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన తీర్పును ఇచ్చారని అన్నారు. పట్టణ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ప్రజా ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగింది అత్యున్నత ప్రమాణాలతో పాలన అందిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఈ ఫలితాలతో స్పష్టమైందని అన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో, ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ తరువాత పంచాయతీ ఎన్నికల్లో వరుసగా ప్రజా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు.
ప్రసారమాధ్యమాల్లో కనిపించాలని, ప్రజల్లో ఉనికిని కాపాడుకోవాలని
ప్రతిపక్షాలు కట్టు కథలు అల్లడం, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలనీ డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలని ప్రజాస్వామ్య వాదిగా తాను బలంగా కోరుకుంటానని డిప్యూటీ సీఎం తెలిపారు.
సంపూర్ణ విజయం కోసం శ్రమించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.















