EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాంగ్రెస్ – బిఆర్ఎస్ : ఒకరినొకరు కాపాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు

ఈతరం భారతం  హైద్రాబాద్ జూన్ 1.

తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేళ్లు దోచుకున్న బిఆర్ఎస్, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు తెర వెనుక ఒకరికొకరు సహకరించుకుంటూ “సుఖ సంసారం” సాగిస్తున్నాయని బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బెయిల్ పార్టీగా కాంగ్రెస్:

దేశంలో జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ఉనికి కోల్పోతోంది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ (సోనియా గాంధీ), లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు (రాహుల్ గాంధీ) ఇద్దరూ బెయిల్ మీద ఉన్నారు. ఆ పార్టీలో అనేక మంది నాయకులు జైలుకు వెళ్లి వచ్చినవారే.

కాంగ్రెస్ – బిఆర్ఎస్ ల డూప్ ఫైట్:

తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. గతంలో ఫిరాయింపుల సమయంలో బిఆర్ఎస్ కి కాంగ్రెస్ సహకరిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ కి బిఆర్ఎస్ సహకరిస్తోంది. ఒకరినొకరు కాపాడుకుంటూ, పైకి మాత్రం కొట్టుకుంటున్నట్టు నటిస్తూ కాలయాపన చేస్తున్నారు. నాటి ఓటుకు నోటు కేసు నుండి నేటి వరకు రాహుల్ గాంధీ అండతోనే ఇరు పార్టీలు కలిసి సంసారం చేస్తున్నాయిని ఎద్దేవా చేశారు.

కుటుంబమంతా అవినీతి ఊబిలో బిఆర్ఎస్ అధినేత (కెసిఆర్) పై అవినీతి ఆరోపణలు వచ్చి, నోటీసులు అందితే విచారణకు వెళ్లకుండా కోర్టుల ద్వారా రక్షణ కవచం పొందేందుకు ప్రయత్నించారు. తండ్రి బాటలోనే కొడుకు (కెటిఆర్) కూడా ఫార్ములా-ఇ రేస్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, జొన్నవాడ అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, మియాపూర్ భూములు, ఎంసెట్ పేపర్ లీకేజీ వంటి అంశాల్లో అదే పంథా అనుసరిస్తున్నారు.

జైళ్లు, నోటీసులు, కోర్టులు:

లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయి బిఆర్ఎస్ కవిత జైలుకు వెళ్లి వచ్చి విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు మేనల్లుడు (హరీష్ రావు) ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై నోటీసులు అందుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాళేశ్వరం విషయంలో సిఎజి  లాంటి రాజ్యాంగ సంస్థలు తప్పులు పట్టినా వీరికి చలనం లేదు.

నైతికత లేని రాజీనామాలు: గతంలో ఎల్ఆర్ఎస్ వ్యవహారం, కుక్కల కాటుకు చిన్నారులు బలి కావడం, భవనాలు కూలిపోవడం వంటి ఘటనలపై కోర్టులు మొట్టికాయలు వేసినా, సుమోటోగా స్వీకరించినా నాటి పురపాలక శాఖ మంత్రులుగా ఉన్న తండ్రీకొడుకులు కనీసం రాజీనామా చేయలేదు. అలాంటి వారు ఈరోజు బిజెపికి నీతులు చెప్పడం హాస్యాస్పదం.

అరాచక పాలన:

కేవలం అవినీతి మాత్రమే కాదు.. న్యాయవాదుల హత్యల వెనుక, ఖమ్మంలో స్వంత పార్టీ మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపుల వెనుక బిఆర్ఎస్ నాయకుల హస్తం ఉందన్న వార్తలు వచ్చాయి. మహబూబాబాద్‌లో మహిళా అధికారులను సైతం నాటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేధించిన చరిత్ర ఉంది.

కరిగిపోయిన రాష్ట్ర ఆస్తులు – పెరిగిన కుటుంబ ఆస్తులు:

2009 అఫిడవిట్‌లో కెటిఆర్ చూపించిన పదుల కోట్ల ఆస్తి, ఈరోజు వందల కోట్లకు ఎలా పడగలెత్తింది? ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి, ప్రభుత్వ ఆస్తులను కరిగించేసి.. ఈ తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడు మాత్రం వందల కోట్లు వెనకేసుకున్నారు.ఒక్కొక్క కుంభకోణం, ఒక్కొక్క నోటీసు నుండి ఈ కుటుంబం తప్పించుకోలేదు. కాంగ్రెస్‌కు ‘బి-టీమ్’గా మారి ఎంత సుఖ సంసారం చేసినా, తెలంగాణ ప్రజలను పిచ్చోళ్లను చేయాలని చూస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. వీరి అక్రమాలను, తెరవెనుక సంసారాన్ని బిజెపి ఖచ్చితంగా బట్టబయలు చేస్తుందని, వీరంతా త్వరలోనే చువ్వలు లెక్కబెట్టడం ఖాయమని ప్రభాకర్  హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top