ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 1 :
ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశానికి గర్వకారణమైన చేనేత రంగానికి ఇచ్చిన కేటాయింపులు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురిచేశాయి అని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అన్నారు.
లక్షలాది చేనేత కుటుంబాల జీవనాధారమైన ఈ కళారంగానికి కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది చేనేతల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవమానానికి నిదర్శనం.ఒకవైపు “ఆత్మనిర్భర్ భారత్” అని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు స్వదేశీ కళలకు ప్రాణమైన చేనేత రంగాన్ని పక్కన పెట్టడం దారుణం.గతంలో ఆల్ ఇండియా హాండ్లూమ్ బోర్డు, సెరిపెడ్ బోర్డులను రద్దు చేసి చేనేత రంగాన్ని మరింత బలహీనపరిచిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పటికైనా తన తప్పును సరిదిద్దుకోవాలి. వెంటనే ఆ బోర్డులను పునరుద్ధరించాలి అని అన్నారు.
తెలంగాణ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి మ్యాడమ్ రామకృష్ణ మాట్లాడుతూచేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు – అది ఒక సంస్కృతి, ఒక చరిత్ర, కోట్లాది చేతులకు ఉపాధి. అలాంటి రంగానికి ఈ స్థాయి కేటాయింపులు చేయడం అంటే చేనేత కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడటమే.అందువల్ల, బడ్జెట్లో తక్షణమే సవరణ చేసి చేనేత రంగానికి కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలని చేనేతలకు రక్షణ, మార్కెటింగ్, ముడిసరకుల సబ్సిడీలు కల్పించాలనితెలంగాణ చేనేత ఐక్య వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని దృఢంగా డిమాండ్ చేస్తోంది అన్నారు.















