ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 27
కవిత కొత్త పార్టీ (తెలంగాణ రాష్ట్ర సేన) ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కొత్త పార్టీ సంగతి తరువాత, ముందు ఉన్న పార్టీ (బీఆర్ఎస్) ఉంటుందా? ఊడుతుందా? కేసీఆర్ పార్టీకే మనుగడ లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీకి గతం ఉంది తప్ప, భవిష్యత్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు వారు ఎలా మాట్లాడినా సహించారన్న ఆయన, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారని అన్నారు.
కేసీఆర్ చావు నేనెందుకు కోరుకుంటా : కేసీఆర్ కుటుంబానికి, బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేవని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబమంతా ఒక్కటేనని, రంగు, రుచి లేదని వ్యాఖ్యానించారు. వారు నటిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అని, ఆయన చావును తానేందుకు కోరుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ మర మనిషో కాదో కుటుంబ సభ్యులకే తెలియాలన్నారు. వివక్ష లేని పాలన కాంగ్రెస్దని, తమకు ప్రతిపక్షమే లేదన్నారు.
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కవిత చెబుతున్నట్లు కేసీఆర్ ఎవరి బందీలో ఉన్నారని, కేసీఆర్ మర మనిషా మనసున్న మనిషా అని కవితకు జవాబివ్వాలన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోనని కేసీఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎక్స్‌పైరీ గడువు తీరిందని ఇక ఆ పార్టీతో పనిలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానమని, కేసీఆర్ తన శత్రువు కాదని కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అన్నారు. కేసీఆర్‌కు చెడు జరగాలని కోరుకుంటోంది ఆయన కుటుంబమేనని అన్నారు.
కేంద్రంపై ఒత్తిడి తెస్తాం : పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, కొన్ని సాంకేతిక లోపాలున్నాయని మాత్రమే చెప్పిందని అన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు వద్దని కోర్టు చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ తర్వాతే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. సీబీఐ వివరాలు కోరితే అన్నీ ఇస్తామని, విచారణ మొదలైతే అన్నీ బయటకు వస్తాయని చెప్పారు. సీబీఐ విచారణ కోరితే కేంద్రం 48 గంటల్లో లోపల వేస్తామన్నారని సీఎం గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరినా కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? అని, విచారణ కోసం కేంద్రం వద్దకు వెళ్తామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉందని తోసిపుచ్చారు.















