హైద్రాబాద్ ఆగస్ట్ 23.(ఈతరం భారతం)ఏలూరు జిల్లా ముసునూరు మండలం వలసపల్లి కి చెందిన దివి రాజ్యలక్ష్మి(48) గత ఏడు సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటివరకు వైద్యం కోసం వారి కుటుంబం తమకు ఉన్న చిన్న స్థలాన్ని విక్రయించి, ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టి, సుమారు ₹15 లక్షలు వరకు ఖర్చు చేశారు. ఆమె భర్త వెంకటాచారి టైలరింగ్ చేస్తూ వచ్చిన సంపాదనతోనే కుటుంబం గడపవలసి ఉంది. దురదృష్టవశాత్తూ ఆయన కూడా ప్రస్తుతం కాలు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఎటువంటి ఆదాయం లేని స్థితిలో ఉన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో రాజ్యలక్ష్మి రేడియేషన్ థెరపీ పొందుతున్నారు. ఆమె ఈ చికిత్స మరికొన్ని నెలల పాటు తీసుకొనవలసి ఉంది. ఈ అత్యంత క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో, వెంకటాచారి గౌరవ దాతలు పోలోజు రవీంద్రాచారి ద్వారా ఆర్థిక సహాయం కొరకు వెస్సో ట్రస్ట్ ను ఆశ్రయించారు. వెస్సో ట్రస్ట్ ద్వారా రాజ్యలక్ష్మి కష్టాన్ని తెలుసుకున్న గౌరవ దాతలు 93,100/- రూపాయలు రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులకు అందజేశారు. హైదరాబాద్ చింతలకుంట వాసవి శ్రీ నిలయంలో జరిగిన సేవా కార్యక్రమంలో గౌరవ దాతలు కొచ్చెర్ల సూర్య భాస్కర రావు శశికళ దంపతులు, బిల్డర్ పోలోజు రవీంద్ర చారి, మురుముళ్ల బ్రహ్మచారి, చెన్నోజు సింహాద్రి చారి, వెదురుపర్తి శ్రీ మంగేష్, వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ పేషెంట్ కష్టాన్ని చూసి తక్షణమే స్పందించి స్వయంగా 50,000/-ల విరాళం అందజేసిన బ్రహ్మశ్రీ కొచ్చెర్ల సూర్య భాస్కరరావు గారికి మరియు ఇతర గౌరవ దాతలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.















