ఈతరం భారతం హైదరాబాద్, జూన్ 3:
దేశంలోని బడుగు, బలహీన వర్గాల రాజకీయ సాధికారత కోసం విశేషంగా కృషి చేసిన ప్రముఖ నేత, స్వర్గీయ గోపినాథ్ ముండే కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని అఖిల భారత వంజరి సేవా సంఘం, తెలంగాణ వంజరి సేవా సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశాయి.
గోపీనాథ్ ముండే 13వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో వంజరి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, దేశంలోని బడుగు వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు, వారికి ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ వేదికను అందించేందుకు గోపీనాథ్ ముండే నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.
జాతీయవాద రాజకీయాల్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అందువల్ల భారతరత్నకు అన్ని విధాలా అర్హులని అన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే మరణించిన గోపీనాథ్ ముండే సేవలను గుర్తించి, ఆయన జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాలను కోరారు.
తెలంగాణ రాష్ట్రానికి గోపీనాథ్ ముండే వంటి ప్రజానాయకుల అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత వంజరి సేవా సంఘం నాయకులు సాల్వేరు కృష్ణ, ఎదుగని శంకర్, ఎదుగని హరినాథ్, కాలేరు సురేష్, ధాత్రిక కాశీనాథ్, కాలేరు యుగంధర్, రిటైర్డ్ డీఎస్పీ శివప్రసాద్, రత్నం సంతోష్ ఆముద లక్ష్మణ్, మహదేవ్ ముండే, కాలేరు సాయిబాబా, ఎదుగని వెంకటేష్ ,మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.














