EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదు స్పష్టం చేసిన స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్గ్

హైదరాబాద్, జులై 29 (ఈతరం భారతం);: గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుందంటూ కొంత మంది సోషల్ మీడియా వేదికగా లేని పోని గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ పెద్దలు తనను పిలుస్తారన్నారు. తన బాధలు వారికి చెప్పిన తర్వాత తాను బీజేపీలో తిరిగి చేరే అంశంపై క్లారిటీ ఇస్తానని చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ అభ్యర్థి వ్యక్తిగతంగా పిలిస్తే.. వెళ్లి ప్రచారం చేస్తానని తెలిపారు.బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనను గుర్తించకపోయినా.. తనను గుర్తించే వాళ్లు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. వారంతా బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నారన్నారు. తాను వెళ్లి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ చాలా బాగా పెరిగిందని వివరించారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు చేసారో అన్ని తనకు తెలుసునని చెప్పారు.కేంద్ర మంత్రులు తనతో టచ్‌లోనే ఉన్నారని చెప్పారు రాజాసింగ్. తాను శివసేన, టీడీపీ, జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఇవన్నీ బీజేపీకి మిత్రపక్ష పార్టీలేనని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షడు రామచందర్ రావు బాగానే పని చేస్తున్నారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నేతృత్వంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

అసలు జరిగింది ఇది..

హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నిక జరిగింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఢిల్లీలోని పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అయితే అదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు అనుచరగణంతో కలిసి పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. అయితే ఆయన్ని పార్టీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.అనంతరం అక్కడే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి, నాయకులకు ఒక దణ్ణం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకులకు పంపారు. వారు వెంటనే దానిని ఆమోదించారు. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరతారంటూ ఓ ప్రచారం అయితే ఊపందుకుంది. ఇది సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయింది.మరోవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జూబ్లీహిల్స్‌తోపాటు గోషా మహల్ అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఉప ఎన్నిక వస్తుందంటూ ఓ ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు బీజేపీని విడిచి పెట్టవద్దంటూ ఢిల్లీలోని కొంత మంది ఆ పార్టీ నేతలు.. రాజాసింగ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అందులోభాగంగా వారు పార్టీ అగ్రనాయకత్వంతో మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ఢిల్లీలోని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని.. వారితో భేటీ తర్వాత మళ్లీ బీజేపీలో చేరే అంశంపై క్లారిటీ ఇస్తారనే ఓ చర్చ అయితే గోషామహల్‌లో సాగుతోంది. అదీకాక.. గత కొంత కాలంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఒక ప్రచారం అయితే సాగుతోంది.

 

Related News

Select the Topic
Scroll to Top