ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 13ఆదివారం
_______________________________________
కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జియాగూడ కేంద్రంగా ‘జై భవాని భవన నిర్మాణ కార్మిక సంఘం’ పేరిట భవన నిర్మాణ కార్మికుల నూతన సంఘం ఆవిర్భవించింది. జై భవాని భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన అధ్యక్షుడుగా జె.ప్రవీణ్సాగర్, ఉపాధ్యక్షుడుగా డి. కోటయ్య యాదవ్, ప్రధానకార్యదర్శిగా కోశిక శ్రీనివాసులు, కార్యదర్శిగా తన్నీరు రాంబాబు, కోశాధికారిగా బి. రమేష్ గౌడ్లతో పాటు 60 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎన్నికయ్యారు ఈ మేరకు జియాగూడలోని 2 బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ (డబుల్ బెడ్రూమ్ కాలనీ) లో ఆదివారం సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారంతో పాటు నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. సంఘం నూతన అధ్యక్షుడు జె ప్రవీణ్సాగర్, ప్రధానకార్యదర్శి కోశిక శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ బోహిని దర్శన్, ఆదిరాల రవికుమార్లతో పాటు భవన నిర్మాణ కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ అధ్యక్షుడు తన్నీరు శ్రీరామ్, గ్రేటర్ ప్రధానకార్యదర్శి తన్నీరు వెంకట శేషారావు, కోశాధికారి చంబేటి ఆనందరావు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సీనియర్ నేత శ్రీధర్సాగర్, కుల్సుంపురా పోలీస్ ఇన్స్పెక్టర్ ఎ. రాములు తదితరులు ముఖ్యఅతిథులుగా విచ్చేసి జై భవాని భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు సంఘం నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బోహిని దర్శన్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే భవన నిర్మాణ కార్మికుల్లో ఇళ్లు లేని వారందరికీ కూడా సొంతిళ్లు నిర్మించి ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భవన నిర్మాణ కార్మికులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆదిరాల రవికుమార్, గ్రేటర్ సంఘం అధ్యక్షుడు తన్నీరు శ్రీరామ్, వెంకట శేషారావు మాట్లాడుతూ జియాగూడ పరిసరాల్లోని భవన నిర్మాణ కార్మికులు ఏకమై సంఘం ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం అన్నారు. భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు, లేబర్ కార్డులు జారీ చేయిస్తామన్నారు. కార్మికుల ప్రమాద బీమా డబ్బులు రూ.10 లక్షలకు పెంచాలని, లేబర్ అడ్డాల్లో కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జై భవాని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు జె. ప్రవీణ్్సగర్, ప్రధానకార్యదర్శి కోశిక శ్రీనివాసులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని, సంఘం కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులు తమ సంఘంలో సభ్యత్వం నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత నర్సింగ్రావు, పలువురు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.














