ఈతరం భారతం హైద్రాబాద్ మే 23:
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మీడియా సమావేశంలో మంత్రులు వెల్లడించారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టు, పీఏసీఎస్‌లు తదితర అంశాలపై చర్చించినట్లు మంత్రులు వెల్లడించారు.
జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం – రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్నట్లు టిలిపారు.
కాళేశ్వరం అంశానికి సంబంధించి ఏవిధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. మంత్రుల సబ్‌కమిటీ వేసుకుని చర్చించుకుని ఎలా ముందుకెళ్లాలనేది నిర్ణయిస్తామని అన్నారు. కాళేశ్వరం వ్యవహారంపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) లేఖ రాసి 9 నెలలు గడిచినప్పటికీ ఎందుకు ముందుకెళ్లట్లేదో మీరే అర్థం చేసుకోవచ్చన్నారు. తాను, సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే సీబీఐ డైరెక్టర్‌ను కలవబోతున్నట్లు వివరించారు.
వారిద్దరూ నిర్దోశులని ఎక్కడా చెప్పలేదు
కాళేశ్వరం అవకతవకలపై వేసిన కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని కేసీఆర్, హరీశ్‌రావులు పిటిషన్ వేశారని, అయితే, కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేసీఆర్, హరీశ్‌రావుల ప్రధాన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చిందని వివరించారు. కమిషన్‌ను చట్టవిరుద్ధం కాదని నివేదిక కొనసాగుతుందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిందన్నారు. సాంకేతిక అంశాల కారణంగానే కేసీఆర్, హరీశ్‌రావులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందన్నారు. వారిద్దరూ నిర్దోషులని, కాళేశ్వరం అవకతవకలకు బాధ్యులు కారని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. అభిషేక్ సింఘ్వీని కలిసి తదుపరి కార్యాచరణ చేపడతామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.
“గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు రూ.వేల కోట్లు పెండింగ్‌లో పెట్టింది. ఇంకా రూ.6 వేల కోట్ల మొత్తం ప్రయోజనాలు వారికి ఇవ్వాల్సి ఉంది. ఈ బెనిఫిట్స్ ఇచ్చేందుకు మంత్రుల వేతనాల్లో సగం కేటాయిస్తున్నాం. బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. పీఏసీఎస్(ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఛైర్మన్లను రాబోయే రోజుల్లో నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేస్తాం. గచ్చిబౌలి స్టేడియంను అభివృద్ధి చేసేందుకు టాటా సంస్థ అంగీకరించింది. ఈ స్టేడియంలోని 76 ఎకరాలను రూ.700 కోట్లతో అభివృద్ధి చేయనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలిపారు.














