ఈతరం భారతం హైదరాబాద్ మే 30
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగులకు అందిస్తున్న సీజన్ పాస్‌ల మాదిరిగానే మహిళలకు ప్రత్యేక స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.ఇప్పటి వరకు మహిళలు ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ విధానంలో కొంతమంది నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు మహిళలు తెలంగాణకు చెందిన వారిగా నకిలీ గుర్తింపు పత్రాలతో ఉచిత ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అర్హులైన మహిళలకే పథకం ప్రయోజనాలు అందేలా స్మార్ట్ కార్డుల విధానాన్ని తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించింది.ఏటీఎం కార్డుల మాదిరిగా చిప్ ఆధారిత డిజిటల్ స్మార్ట్ కార్డులను రూపొందించనున్నారు. మహిళల ఆధార్ వివరాలు, ఫొటో, వ్యక్తిగత సమాచారం కార్డులోని చిప్‌కు అనుసంధానం చేయబడుతుంది. కార్డుపై ఫొటోతో పాటు క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుంది.ఈ స్మార్ట్ కార్డు ఆధారంగానే భవిష్యత్తులో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వనున్నారు. దీంతో నకిలీ గుర్తింపు పత్రాలతో ప్రయాణాలకు అడ్డుకట్ట పడనుంది.
మొదట ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు కార్డులు అందజేయనున్నారు.స్మార్ట్ కార్డుల తో టికెట్లు జారీ చేసేందుకు కండక్టర్లకు ప్రత్యేక కార్డు రీడర్లు కూడా అందించనున్నట్లు సమాచారం .














