ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 10 :
_________________________________
విద్యార్థుల మేధో వికాసానికి మాతృభాష ఎంతో కీలకమని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి భాషా, సాహిత్యాల అధ్యయనం తప్పనిసరి అని ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొ. కుమార్ మొలుగరం అభిప్రాయపడ్డారు. ఓయూలోని తన కార్యాలయంలో డిగ్రీ తెలుగు పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవీయ విలువలు ప్రశ్నార్థకమవుతున్న రోజుల్లో వ్యక్తి జీవితంలో భాషా, సాహిత్యాల అధ్యయనం ఎంతో కీలకమని అన్నారు. పాఠ్య పుస్తకాలు విద్య, భాషపట్ల అభిమానాన్ని, జాతీయత, మానవతా దృక్పథాన్ని, నైతిక విలువలను, విమర్శనాత్మక, సృజనాత్మక ఆలోచనలను విద్యార్థులలో ప్రోది చేస్తాయని అన్నారు. తెలుగుశాఖ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రొ. సి. కాశీం సంపాదకత్వంలో మొదటి సెమిస్టర్ సాహితీ మంజీర పుస్తకాన్ని, డా. ఎస్. రఘు సంపాదకత్వంలో మూడవ సెమిస్టర్ సాహితీ కిన్నెర పాఠ్యపుస్తకాలను రూపొందించి, ప్రచురించడాన్ని అభినందించారు. పుస్తకాల రూపకల్పనలో భాగస్వాములైన పాఠ్యప్రణాళిక సంఘం సభ్యులందరి కృషిని ప్రశంసించారు. తెలుగుభాషా సాహిత్యాల అభివృద్ధికై తెలుగుశాఖ చేస్తున్న కృషిపట్ల ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. సి. కాశీం, తెలుగుశాఖ అధ్యక్షులు డా. ఏలె విజయలక్ష్మి, తెలుగు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డా. ఎస్. రఘు, ప్రొ. సాగి కమలాకర శర్మ, అధ్యాపకులు డా. ఇమ్మిడి మహేందర్ పాల్గొన్నారు.















