ఈతరంభారతం హైదరాబాద్ జూలై 23 :ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప్పల్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో “అక్షర శరధి దాశరధి (దాశరధి సాహిత్య సమాలోచన) ” అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ , సినీ సాహిత్య పరిశోధకులు డాక్టర్ చింతల రాకేశ్ భవాని హాజరై ” దాశరధి సినీ గీతాలు – భక్తితత్త్వం ” అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేశ్ భవాని మాట్లాడుతూ పాటల పయోనిధిగా , సినీగీతాల వారధిగా తెలుగు సినీ గేయ సాహిత్యాన్ని దాశరధి సుసంపన్నం చేశారన్నారు. దాశరధి సినీ గీతాల్లోని భక్తి తత్వాన్ని పాడుతూ విశ్లేషించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో దాశరధి సినిమా పాటల పై మరిన్ని పరిశోధనలు రావలసిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు నిర్వాహకులు డా .రాకేశ్ భవానిని సత్కరించారు.















