ఈతరం భారతం హైదరాబాద్ నుంచి సెప్టెంబర్ 12 శనివారం
________________________________________________
విద్యా రంగ సంస్కరణలు, పాలిటెక్నిక్ కాలేజీలపై నెలకొన్న అనుమానాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టెక్నికల్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మరోవైపు విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.26,647 కోట్లకు పెంచామని, 32 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.3,488 కోట్లు చెల్లించినట్లు సీఎం వెల్లడించారు.తెలంగాణ విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో మార్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరిస్తారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ ఆధీనంలోని పాలిటెక్నిక్‌లు ప్రభుత్వ పరిధిలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి జీఓ ఎంఎస్ నంబర్ 97పై వివాదాలు తలెత్తిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. పాలిటెక్నిక్‌లను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు ఇకపై కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాంకేతిక విద్యా వ్యవస్థను స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం చేయడం వెనుక విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని వివరించారు. విద్యార్థులు ఎవరి చేతుల్లోనూ పావులుగా మారొద్దని, తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. పాలిటెక్నిక్‌ల విషయంలో ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే సభ్యులు, విద్యా రంగ నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.















