ఈతరం భారతం హైద్రాబాద్ మే 15 :
పెట్రో రేట్ల పెంపుపై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు, విద్యుత్ ఛార్జీలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ పెట్రో ధరల పెంపు ప్రజలపై మరింత భారంగా మారిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న సమయంలో కూడా దేశంలో పెట్రో ధరలను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని, చివరకు సామాన్యుడు తీవ్రంగా నష్టపోతాడన్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధానాలకే పరిమితమైందని విమర్శించారు. ప్రజల సంక్షేమం కంటే పన్నుల వసూళ్లపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని, వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.














