EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పోలీసులకు తీపికబురు..  పుట్టినరోజు, పెళ్లిరోజుకు సెలవు

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 28

విధి నిర్వహణలో క్షణం తీరికలేకుండా, కుటుంబానికి దూరంగా గడిపే పోలీసుల కు ఒత్తిడితో కూడిన వారి విధులను, సమాజం కోసం వారు చేస్తున్న వ్యక్తిగత త్యాగాలను గుర్తిస్తూ పోలీసు శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి వారి పుట్టినరోజు తో పాటు పెళ్లిరోజు నాడు కచ్చితంగా సెలవు మంజూరు చేయాలని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన పోలీసు శాఖలోని అన్ని విభాగాలకు ఓ సర్క్యులర్ మెమో జారీ చేశారు.కుటుంబంతో సంతోషంగా గడిపేలా.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పండుగలు, పబ్బాలు, సెలవులు వదులుకుని నిరంతరం విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి మనోధైర్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ర్యాంకులతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ సెలవు వర్తిస్తుంది.

తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ రెండు రోజులను ప్రతి పోలీసు అధికారి తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు, వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని డీజీపీ ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. పోలీసు బలగాలు కనబరుస్తున్న అంకిత భావానికి గుర్తింపుగానే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఈ సెలవు మంజూరుకు సంబంధించి డీజీపీ కొన్ని మార్గదర్శకాలను విధించారు.

అసాధారణ, అత్యవసర పరిస్థితులు ఉంటే మినహా.. సాధారణ సమయాల్లో సిబ్బంది కోరిన వెంటనే యూనిట్ అధికారులు విధిగా ఆయా రోజుల్లో సెలవు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఈ సెలవును సిబ్బంది తమ జన్మహక్కుగా భావించకూడదని, అత్యవసర పరిస్థితుల్లో సెలవును నిరాకరించే అధికారం మంజూరు చేసే ఉన్నతాధికారికి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే.. సర్వీస్ రిజిస్టర్‌లో నమోదైన పక్కా ఆధారాల తేదీల ప్రకారం మాత్రమే ఈ సెలవు ఇస్తారు. ఈ అవకాశం వినియోగించుకోవాలనుకునే వారు విధిగా ముందుగానే తమ పైఅధికారులకు రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top