ఈతరం భారతం ఆగస్టు 7 హైదరాబాద్ :జంటనగరాల నుండి, పూణే, ముంబై వైపు వెళ్లే ఆర్.టి.సి. బస్సులు, ఇతర వాహనాలతో ఈ కూడలి ప్రతి రోజు, 24 గంటలూ చాలా రద్దీగా ఉంటుంది. బి.హెచ్.ఈ.యల్. వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ ఎప్పుడూ వాహనాలతో క్రిక్కిరిసి ఉంటుంది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కూడా జంటనగరాల నుంచి పటాన్చెరు, అలాగే, పటాన్చెరు నుండి జంటనగరాలకు నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. లింగంపల్లి, వినాయక నగర్, జ్యోతినగర్, బి.హెచ్.ఈ.యల్-హెచ్.ఐ.జి., మయూరి నగర్, కాకతీయ నగర్, రామచంద్రపురం, పటాన్చెరు నుంచి జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల మధ్య విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు వివిధ వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్.టి.సి. బస్సులు చాలా రద్దీగా, ఎప్పుడూ కిక్కిరిసి ఉంటున్నాయి. ముఖ్యంగా అశోక్ నగర్ బస్ స్టాప్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కానీ అవి పనిచేయకపోవడంతో, బస్సు దిగిన తర్వాత అటువైపునుంచి జ్యోతి నగర్, అశోక్ నగర్ వైపుకు, అశోక్ నగర్ నుండి హెచ్.ఐ.జి. వైపుకు రాకపోకలు సాగించే బాటసారులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాలకు కూడా గురౌతున్నారు. ఎప్పుడూ పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల ఎటునుంచి ఏ వాహనం వస్తుందో తెలియక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను గమనించి, పోలీస్ అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్ ను క్రమబద్ధీకరించి, పాదచారుల ఇక్కట్లను, ప్రాణాలను కాపాడవలసినదిగా స్థానిక కాలనీల సంక్షేమ సంఘాలు, ప్రజలు, పాదచారులు వేడుకుంటున్నారు.















