EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బహుజనులనే గెలిపిద్దాం  బహుజన విజయానికి ఓటు హక్కు వినియోగించాలి

హైద్రాబాద్ మార్చ్ 22: ఈతరం భారతం

తెలంగాణ రాష్ట్రంలోని హైకోర్టు, జిల్లా కోర్టులు మరియు మున్సిఫ్ కోర్టులలో 26-03-2026న జరగనున్న అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా బీసీ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు పిలుపునిచ్చింది. బహుజన వర్గాలకు చెందిన అభ్యర్థులలో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను గుర్తించి, వారికి మాత్రమే ఓటు వేసి గెలిపించాలని సూచించింది. ఓటు మార్పిడి ద్వారా ఐక్యతను ప్రదర్శించి, న్యాయవ్యవస్థలో బహుజన ప్రతినిధిత్వాన్ని పెంచాలని పిలుపునిచ్చింది.

ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ టి. రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ పొన్నం దేవరాజు గౌడ్ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయిలలో అగ్రవర్ణాలే అధికంగా కొనసాగుతున్నారని, వ్యవస్థాత్మకంగా అదే వర్గాలకు అధిక ప్రాధాన్యం లభించే విధంగా పరిస్థితులు రూపొందించబడ్డాయని విమర్శించారు.

రిజర్వేషన్లకు మరియు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయని, ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు అందుకు ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బహుజన వర్గాలకు చెందిన న్యాయవాదులు చురుకైన పాత్ర పోషించి, తమ హక్కులను సాధించుకునేందుకు సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

“మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. మా వాటా మా బహుజనులకు దక్కాలనేదే మా ప్రధాన లక్ష్యం” అని వారు స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో సమాన అవకాశాలు కల్పించాలంటే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్లలో బహుజన వర్గాల న్యాయవాదులు ఐక్యంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బీసీ లాయర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కరపత్రాన్ని విడుదల చేసి, ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహరచనను వివరించారు.ఒకవేళ ఒక బార్ అసోసియేషన్ కు ఇద్దరు బహుజన్లు పోటీ పడితే అందులో బహుజన స్పృహ ఉన్న వారిని ఎన్నుకోవాలని సూచించారు.హైకోర్టు నుండి మున్సిఫ్ కోర్టుల వరకు అన్ని స్థాయిలలో బహుజన అభ్యర్థులను గెలిపించేందుకు కట్టుబడి పని చేయాలని సూచించారు.

న్యాయవ్యవస్థలో సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ఇది ఒక కీలక దశగా భావిస్తూ, ప్రతి బహుజన న్యాయవాది తన ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించాలని బీసీ లాయర్స్ అసోసియేషన్ పునరుద్ఘాటించింది. బీసీ సంక్షేమ సంఘము అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, జరగబోతున్న బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీల ఐక్యత చాటాల్సిన అవసరం ఉందని న్యాయవ్యవస్థలోబహుజన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని ఆయన అన్నారు.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు మాట్లాడుతూ, సమాజంలో ఆత్మ గౌరవం కొరకు తమదైన వాటా కొరకు అధికారం కృషి కొరకు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఇందుకొరకు బీసీ లాయర్ అసోసియేషన్ చేస్తున్న కృషి ని ఆయన అభినందించారు

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి టి రాహుల్,బిసి జాక్ చైర్మన్ఎం రంగయ్య , డెమొక్రటిక్ జాక్ చైర్మన్ కోలాజనార్ధన్, జెల్ల లింగన్న న్యాయవాదులు జక్కుల వంశీకృష్ణ, గరిక మల్లేశం కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ వివేక్ సామ్రాట్ , అది నారాయణ, రాజు, విజయ్, తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top