ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 26:
__________________________________
తెలంగాణ వీరత్వానికి, పౌరుషానికి, ఆత్మగౌరవ పోరాటానికి చిరునామా వీరనారి చాకలి ఐలమ్మ అని, నాటి నిరంకుశ నిజాం, రజాకార్లు, విస్నూర్ దొరల గడీల పాలనపై ఎదిరించి పోరాడిన ఆమె చరిత్ర యావత్ దేశానికే స్ఫూర్తిదాయకమని భారతీయ జనతా పార్టీ నాయకులు కొనియాడారు. నాడు దొరలు, నిజాం సాగించిన భూదోపిడీ, అణచివేతలే నేడు కాంగ్రెస్ పాలనలో సరికొత్త రూపంలో పునరావృతమవుతున్నాయని, కాలం మారినా పాలకుల దోపిడీ వ్యవస్థలు మారలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బహుజనుల, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి భరోసా కేవలం బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి వేడుకలను బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ‘సాధిద్దాం సాధిద్దాం.. ఐలమ్మ ఆశయాలు సాధిద్దాం’, ‘బీసీల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ కార్యకర్తల నినాదాలతో పార్టీ కార్యాలయం మార్మోగింది.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “దున్నేవాడిదే భూమి.. పండించేవాడిదే పంట” అని లక్షా యాభై వేల ఎకరాలున్న విస్నూర్ రామచంద్రారెడ్డి లాంటి దొరను ఢీకొట్టిన బీసీ వీరనారి ఐలమ్మ అని గుర్తుచేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఐలమ్మ త్యాగాలను దేశవ్యాప్తంగా చాటారన్నారు. అయితే తెలంగాణలో కాలం మారినా పాలనా వ్యవస్థల తీరు మారలేదని విమర్శించారు. నాడు నిజాం, రజాకార్లు, దొరలు ఉంటే.. నేడు వారి స్థానంలో ఎంఐఎం, కాంగ్రెస్ గడీల దొరలు చేరారని మండిపడ్డారు. రూ.6 లక్షల కోట్ల దోపిడీకి ‘హిల్ట్’ పాలసీ తెచ్చారని, కోటి ఎకరాల అసైన్డ్, పేదల భూములను 22-A కింద వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో భూభారతిలతో పేదల భూములను కాజేస్తున్నారని, పహానీలలో అనుభవదారుడి కాలమ్ తొలగించి పేదలకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో మధ్యతరగతి బిల్డర్లను భయభ్రాంతులకు గురిచేసి, పెద్ద రియల్టర్లకు రహదారి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడే సర్వాయి పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ కలలుగన్న సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ ట్యాంక్ బండ్ లేదా నెక్లెస్ రోడ్డుపై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని పార్టీ తరఫున హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర సహ ఇంచార్జ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర.వకులాభరణం కృష్ణమోహన్ రాష్ట్ర , జిల్లా నాయకులు, ఓబీసీ మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















