ఈతరం భారతం హైద్రాబాద్ మే.5
వెస్సో సంస్థ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని వెస్సో టీమ్ ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ లో మంగళవారం జిహెచ్ఎంసి కాంప్లెక్స్ ఆవరణలో జనహిత సేవ ట్రస్ట్ వారి సహకారంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. 140 మంది మధ్యాహ్న భోజనం చేసిన ఈ సేవా కార్యక్రమానికి ట్రస్ట్ సంస్థాపక అధ్యక్షుడు బంగారు తాతారావు తో పాటు, విశ్వంలో విలీనం సేవా ట్రస్ట్ నుండి పెంట శ్రీనివాస ఆచార్య మరియు విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ సేవా ట్రస్ట్ నుండి వింజరపు గోవిందరావు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బంగారు తాతారావు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరములుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా ఆరువేల మందికి పైగా లబ్ధి పొందారని, ఇప్పటివరకు మొత్తం ఒక కోటి ఐదు లక్షలు వైద్యం, విద్య, పేద వధువు వివాహం, మహిళా సాధికారత, అంత్యక్రియలు వంటి వివిధ పథకాలకు చెందిన లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. నూటికి నూరు శాతం ‘పారదర్శకత’ తో పని చేయడం వలననే వెస్సో ట్రస్ట్ కు దాతల నుండి మంచి ఆదరణ లభించిందని, తాము సేవలకే ప్రాధాన్యత ఇస్తామని, ఇతరత్రా హంగు, ఆర్భాటాలకు తమ వద్ద తావు లేదని తెలిపారు.
గత సంవత్సరం నిర్వహణ ఖర్చులు కేవలం 1.73 శాతమని, ప్రతి సేవా కార్యక్రమానికి గౌరవ దాతల నుండి వచ్చిన విరాళాల మొత్తాన్ని వచ్చినది వచ్చినట్లుగా లబ్ధిదారులకు వెనువెంటనే అందజేస్తామని, లెక్కలు పత్రాలకు సంవత్సరం ఆఖరి వరకు ఆగవలసిన అవసరం కూడా లేదని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భావ సారూప్యత కలిగిన విశ్వకర్మీయ సేవా సంస్థలతో చేయి చేయి కలిపి సమాజ హితం కొరకు పని చేయడమే తమ ధ్యేయమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగావెస్సో ను వెనుక ఉండి నడిపిస్తున్న గౌరవ దాతలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.














