EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వేదోత్సవం – సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణ

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 27:

“వేదోఅఖిలోధర్మమూలమ్” – సకల ధర్మములకు మూలము వేదము. ఈ జగత్తంతా ధర్మము పై ఆధారపడితే, ఆ ధర్మము వేదము పై ఆధారపడినది. ఆ వేద ప్రమాణములను రక్షించుకోవలసిన బాధ్యత ప్రతీఒక్కరిదీ. ఈ తలంపు తోనే “ధర్మో రక్షతి రక్షితః” అనే వేదోక్తి ననుసరించి, సనాతన ధర్మం, వేద పరి రక్షణ, పేద విద్యార్థులకు, నిరాశ్రయులైన వారికి ఆర్థిక సహాయం అందించడం, గోసేవ ఇత్యాది ఆశయాలతో సమాజానికి మేలు చేసే ధార్మిక పనులు చేయసంకల్పించి “విశ్వ వేద పారాయణ బృందం” పేరుతో 2019 లో ప్రవాస భారతీయులైన చుండూరు రఘు కుమార్ శర్మ ఆధ్వర్యంలో హూస్టన్ [అమెరికా] లో స్థాపించబడింది.

హైదరాబాద్ నగరంలో 2021 సంవత్సరములో శ్రీమతి గంగా ఇందిర అధ్యక్షతన “విశ్వ వేద పారాయణ బృందం” ప్రారంభింపబడింది. మాజీ ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆధ్వర్యంలో నడుపుతున్న వేద వ్యాస విద్యా విజ్ఞాన వారథి, ఆర్.ఎస్. లక్ష్మణ్ సారధ్యంలో నడుపుతున్న తరుణి ఫౌండేషన్ సంస్థ ల సహకారంతో “విశ్వ వేద పారాయణ బృందం” హైదరాబాద్ లో పలు సేవా కార్యక్రమాలను చేపడుతోంది.

విశ్వ వేద పారాయణ బృందం”యొక్క ముఖ్య లక్ష్యమైన వేద పరి రక్షణ లో భాగంగా వేద పాఠశాల లో వేదం నేర్చు కోవాలి అనే ఆసక్తి తో విద్యార్థులు చేరుతున్నప్పటికీ, ఆ పాఠశాల ను నడుపుతున్న గురువు లకు సరైన ఆర్థిక వనరులు లేక ఏ పాఠశాల యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందో, అటువంటి పాఠశాల లను గుర్తించి వాటికి ఆర్థిక సహాయాన్ని సమకూరుస్తూ, మరింత మంది వేద పండితులను, వేద ప్రమాణములను తెలిసిన వారిని సమాజానికి అందిస్తోంది. ఈ ప్రయాణం లో భాగంగా ఇప్పటికి వరకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో నెలకొన్న 14 వేద పాఠశాలల అభివృద్ధికి తోడ్పడుతోంది.

దేవభాష అయిన సంస్కృత భాషే అన్ని భాషలకు మూలం కాబట్టి అట్టి దేవభాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహించడం కోసం కొవ్వూరు(ప.గో. జిల్లా, ఆం.ప్ర.) లో స్థాపించిన ఆంధ్ర గీర్వాణ విద్యాలయానికి తగు రీతిలో ఆర్థిక సహాయాన్ని అందచేస్తూ సంస్కృత భాషాభివృద్ధికి “విశ్వ వేద పారాయణ బృందం” తన వంతు కృషి చేస్తోంది.

“ఆరోగ్యమే మహా భాగ్యం” అన్న నానుడి ననుసరించి సమాజం లో ఉచిత వైద్య సేవలు అందించే వరల్డ్ టీచర్స్ ట్రస్ట కి తనవంతు సహాయాన్ని అందిస్తోంది విశ్వ వేద పారాయణ బృందం. ఇవికాక సామాజిక సేవ గా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఫీజులు, కుటుంబ సభ్యుల ను కోల్పోయి నిరాశ్రయులైన వారికి, అనారోగ్యం తో బాధపడుతున్న వృద్ధులకు తగిన రీతిలో వైద్య సహాయం “విశ్వ వేద పారాయణ బృందం” ద్వారా అందించడమవుతోంది.

తమ ముఖ్య లక్ష్యాల లో ఒకటైన సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా విశ్వ వేద పారాయణ బృందం సుమారు 200 మంది వేద విద్యార్థులు, వేద పండితులు, ఘనాపాటీల తో ఈ నెల 28వ తేదీ, శనివారం ఉదయం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం దుర్గాబాయి దేశ్ ముఖ్ కాలనీ నందుగల శ్రీ సత్యసాయి ఆరాధ్య ధామం నందు జరుప తలపెట్టింది. ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేట్టు ఆశీస్సులు అందించ వలసిందిగా ధార్మిక వరేణ్యులందరికీ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు .

Related News

Select the Topic
Scroll to Top