EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సామాన్యులకు మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట

హైదరాబాద్ ఆగస్టు 13 (ఈ తరం భారతం );: సామాన్యులకు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించింది. దేశంలో రిటైల్ (చిల్లర) ద్రవ్యోల్బణం గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఈ ఏడాది జూలై నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.55 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు స్పష్టంచేశాయి. 2017 జూలై తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి.జూన్ నెలలో 2.10 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఒక్క నెలలోనే 55 బేసిస్ పాయింట్లు తగ్గి 1.55 శాతానికి పడిపోయింది. ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడమే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా మైనస్ 1.76 శాతానికి పడిపోయింది. 2019 జనవరి తర్వాత ఆహార ధరలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా పప్పుధాన్యాలు, కూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు, చక్కెర లాంటి నిత్యావసరాల ధరలు దిగిరావడం సామాన్యుడికి పెద్ద ఉపశమనం కలిగించింది.రవాణా, కమ్యూనికేషన్, విద్యా రంగాల్లోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ ద్రవ్యోల్బణం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 1.72 శాతం ఉండగా జూలైలో 1.18 శాతానికి తగ్గింది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2.56 శాతం నుంచి 2.05 శాతానికి దిగివచ్చింది. రెండు ప్రాంతాల్లోనూ ఆహార పదార్థాల ధరలు రుణాత్మక స్థాయిలోనే నమోదయ్యాయి. అయితే, కొన్ని రంగాల్లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి.గృహ నిర్మాణ రంగంలో ద్రవ్యోల్బణం 3.17 శాతం వద్ద స్థిరంగా ఉండగా, ఆరోగ్య రంగంలో స్వల్పంగా 4.57 శాతానికి పెరిగింది. ఇంధనం, విద్యుత్ రంగాల్లో కూడా స్వల్ప పెరుగుదల నమోదైంది. దీనిపై ఎల్ & టీ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సచ్చిదానంద్ శుక్లా మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం తగ్గడం ఇది వరుసగా తొమ్మిదోసారి అన్నారు. బహుశా ఇదే కనిష్ఠ స్థాయి కావచ్చని అభిప్రాయపడ్డారు. 2026 మార్చి నాటికి ద్రవ్యోల్బణం ఇప్పుడున్న దానికి మూడు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు

.

 

Related News

Select the Topic
Scroll to Top