ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 24 :సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహాన్ని గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి నుంచి మఖ్దూం భవన్‌కు తరలించారు. నేతలు, అభిమానుల సందర్శనార్థం సాయంత్రం వరకు అక్కడే ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మఖ్దూం భవన్‌కు వెళ్లి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. సురవరం సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం చేసిన సేవలను ముఖ్యమంత్రులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్‌రెడ్డి అని కొనియాడారు. రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా సురవరం ఎదిగారని, పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ స్థాయి నేతగా ఎదగటం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన గొప్పనేతల్లో సురవరం సుధాకర్‌రెడ్డి ఒకరని కొనియాడారు. అధికారం ఉన్నా, లేకున్నా తన సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదని కొనియాడారు. సురవరం కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుందని, దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం గొప్ప నేతల పేర్లను పలు సంస్థలకు పెట్టిందని, సురవరం సుధాకర్‌రెడ్డి సేను అందరూ స్మరించుకునేలా చేస్తామని తెలిపారు.















