ఈతరం హైదరాబాద్ జనవరి 26
‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?’ అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్ అని హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రశంసించారు. అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్ ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో చూపిన తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదని ఉందనిపిస్తుందన్నారు. ఓ పక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. మరోపక్క బాధితుల ఆర్తనాదాలు.. అయినా దినేష్ వెనకడుగు వేయలేదని కొనియాడారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారని మెచ్చుకున్నారు. ప్రమాదం జరిగితే వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసే ఈ రోజుల్లో.. ప్రాణాలకు తెగించి దినేష్ చేసిన సాయం నిజంగా సాహసోపేతమన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దినేష్‌ను సత్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉందని, హ్యాట్సాఫ్ దినేష్ అని సిపి సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు.















