ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 1 :
చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో, అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు తెలంగాణ కవుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుతారపు వెంకట నారాయణ కు ఆహ్వానం అందింది. ఈ మహాసభలు 2026 జూన్ 6 మరియు 7 తేదీలలో (శనివారం, ఆదివారం) రాజమహేంద్రవరం నగరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించబడనున్నాయి.చైతన్య సారస్వత పరిషత్ అధ్యక్షులు, కిమ్స్ మరియు గ్లోబల్ యూనివర్సిటీ అధినేత కె.వి.వి సత్యనారాయణరాజుగారు (శ్రీ చైతన్యరాజు) సౌజన్యంతో, అక్షర తపస్వి, సాహిత్య భూషణ్, నిరంతర సాహితీ యోధుడు, కళారత్న కత్తిమండ ప్రతాప్ కుమార్ సారథ్యంలో ఈ మహాసభలు జరగనున్నాయి.
ఈ సందర్బంగా సుతారపు వెంకట నారాయణ మాట్లాడుతూ తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు. అది ఒక జాతి సంస్కృతికి చిరునామా, చరిత్రకు గర్వకారణం. భావాలకు, భాషకు, భవిష్యత్తుకు వెలుగునిచ్చే అక్షర దీప్తి తెలుగు. అలాంటి తెలుగు వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రతిష్టాత్మకంగా చాటిచెప్పాలనే మహత్తర సంకల్పంతో ఈ మహాసభలు నిర్వహించబడుతున్నాయి. శ్రీశ్రీ కళావేదిక నిరంతర సాహితీ, సాంస్కృతిక కత్రువులో భాగంగా తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగుసంస్కృతి, తెలుగు సంపద్రాయాల పరిరక్షణలో భాగంగా సాహిత్య ప్రభంజనం సృష్టిస్తూ వందలాది కార్యక్రమాలు చేస్తున్న సంగతి విధితమే.మహాసంగమంగా నిలిచే ఈ మహాసభలకు దేశ విదేశాల నుండి ప్రముఖ కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు, భాషాభిమానులు పాల్గొననున్నారు. సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుందన్నారు.














