ఈతరం భారతం ఖమ్మం/ కల్లూరు, ఫిబ్రవరి 06
అధికారమే పరమావధిగా అబద్ధపు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి కల్లూరు మున్సిపల్ ఎన్నికలే సరైన గుణపాఠం కావాలని, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నట్టేట ముంచిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్‌కే దక్కుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కో ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా శుక్రవారం కల్లూరు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ కాషాయ సునామీని తలపించింది. మున్సిపల్ పోరులో భాగంగా కల్లూరు పురవీధుల్లో బీజేపీ చేపట్టిన ఈ శక్తి ప్రదర్శన అధికార పార్టీ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జనసంద్రంగా మారగా, యువత డప్పు వాయిద్యాలు, తీన్మార్ డాన్సులతో చేసిన కోలాహలం ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓపెన్ టాప్ వాహనంలో పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంచార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా కల్లూరు నడిబొడ్డున జరిగిన బహిరంగ సభలో పొంగులేటి సుధాకర్ రెడ్డి తనదైన వాగ్దాటితో ప్రసంగించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ నాయకులు నేడు ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పంపిస్తున్న కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లిస్తూ, కేంద్రం పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుని ఘనకార్యంగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఇకపై సాగనివ్వబోమని హెచ్చరించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల ద్వారా భారీగా నిధులు కేటాయిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కల్లూరు మున్సిపాలిటీ దుమ్ము ధూళితో, సరైన డ్రైనేజీ లేక, మౌలిక వసతులు లేక అల్లాడుతుంటే ఇక్కడి పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అంతకుముందు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా పొంగులేటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న సంపన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం తన స్వలాభం కోసం వాడుకుని, రాష్ట్రాన్ని ఏకంగా ఏడు లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, అవి కేవలం కుటుంబ పార్టీలని, దొందు దొందేనని విశ్లేషించారు. కల్లూరు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం అత్యవసరమని, కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా ప్రజలకు అందాలంటే మధ్యలో దళారీ వ్యవస్థ లేని బీజేపీ పాలకవర్గం ఇక్కడ గెలవాలని స్పష్టం చేశారు. స్థానికంగా జరుగుతున్న భూ ఆక్రమణలు, అవినీతి అక్రమాలపై బీజేపీ గెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సామాన్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని, ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, మోడీ విజన్‌ను వివరించాలని పొంగులేటి దిశానిర్దేశం చేశారు. కల్లూరు గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయేనని, ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉప్పర్ల శారద, దొంగల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు గుత్తా వెంకటేశ్వరరావు, నాయుడు రాఘవరావు, యాపా సీతయ్య, సురేందర్ రెడ్డి, నున్న రవికుమార్, బోయల వెంకట్, నంబూరి రామలింగేశ్వరరావు, ఈవి రమేష్, గుమ్మా రామ కృష్ణ, ఆపద వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.















