EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్..

ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 18 :జిల్లాలో యూరియాకు గాని ఇతర ఎరువులకు గానీ ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో కలిసి ఆయా జిల్లాల్లో పంటల సాగు, యూరియా లభ్యతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఈసారి ముందస్తు వర్షాలు పడటం ఆగస్టులో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు అన్ని రకాల పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. రైతులకు అవసరమైన యూరియా ఇతర ఎరువులు అందుబాటులో ఉండే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా యూరియా విషయానికొస్తే.. భారతదేశానికి ఇతర దేశాల నుంచి రావాల్సిన యూరియా సకాలంలో రావడంలేదని అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నిలువ ఉన్నటువంటి యూరియాను ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు లేకుండా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎరువులు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఏ మండలంలో రైతులకు యూరియా అవసరం ఉందో అట్టి మండలానికి వెంటనే యూరియా పంపించి సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…గత సంవత్సరం ఖరీఫ్ పంటకు 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, ఆగస్టు మాసం వరకు 13,900 మెట్రిక్ టన్నుల యూరియా వాడకం జరిగిందని తెలిపారు. విస్తారంగా వర్షాలు కురవడం, నెలరోజులు ముందుగానే వర్షాలు రావడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే 6 వేల యూరియాను ఎక్కువగా వినియోగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాకు సెప్టెంబర్ వరకు మరో 8 వేల 500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని తెలిపారు. ఫర్టిలైజర్ షాపులను ప్రతిరోజు సందర్శించి యూరియా నిల్వలను పరిశీలించడం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న యూరియా నిల్వలతో జిల్లాలో ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, ఎడిఎ సంగీతలక్ష్మి, మార్కెటి శాఖ అధికారి పుష్పమ్మ, కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top