ఈతరంభారతం ఖమ్మం ఆగస్టు 17 :కొనిజర్ల మండలంలో ఆదివారం వైరా మాజీ శాసనసభ్యురాలు బానోత్ చంద్రావతి పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పెసర పంట పొలాలను భాణోత్ చంద్రావతి పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన వర్షాలకు పెసర రైతులకు భారీగా నష్టం జరిగిందని రైతులను ఆదుకునేందుకు నష్టపరిహారం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు పంటల భీమా అమలు చేయాలన్నారు. పంటల బీమా అమలు చేస్తే పంటలు నష్టపోయినప్పుడు రైతులకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. ఎంతోమంది రైతులు పెసర సాగు చేశారని చేతికి పంట వచ్చే సమయంలో కురిసిన వర్షాలకు పెసరకాయ కుళ్ళిపోయి బూజు పట్టడం జరిగిందని దీనితో పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు పెసర పంటను చూసి కన్నీటి పరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే గ్రామాలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు















