ఈతరం భారతం ఖమ్మం, ఆగస్టు- 31
—————————————
సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం మంత్రి, స్థానిక ప్రకాశ్ నగర్ లో కాటన్ మార్కెట్ నుండి ప్రకాశ్ నగర్ మీదుగా ఎస్ వి ఎం స్కూల్, దంసలాపురం రోడ్డు వరకు రూ. 12 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, తనకు ప్రజాశ్రేయస్సే ముఖ్యమని, తాను ఎప్పుడూ పదవులను ఆశించలేదని, కేవలం ప్రజల ఆకాంక్షలు, ఒత్తిడి మేరకే రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు. స్వార్థ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. ఖమ్మం ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి, ఇచ్చిన ఆదరణకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, అభివృద్ధి రూపంలో ఆ రుణం తీర్చుకుంటానని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గానికి అవసరమైన విద్యా, వైద్య, రహదారుల నిర్మాణంతో పాటు మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలు కోరిన, తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. రాజకీయ వర్గాలు, కులమతాలకు అతీతంగా ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ అందరి సహకారంతో ఖమ్మం రూపురేఖలు మారుస్తామని మంత్రి అన్నారు.
ఖమ్మం పట్టణాన్ని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడమే తమ ఏకైక కోరిక అని, నియోజకవర్గంలో రవాణా, తాగునీరు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం ఖమ్మమేనని తెలిపారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందేలా మౌళిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రజలందరూ అంగీకరిస్తే 100 సంవత్సరాల భవిష్యత్తు అవసరాలకు సరిపడేలా రోడ్ల వెడల్పు, అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి అన్నారు.
ఖమ్మం పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి రూ. 250 కోట్లు మంజూరు చేశారన్నారు. పట్టణంలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి, 24 గంటల పాటు మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పట్టణంలో దౌర్జన్యాలు, కబ్జాలు, అక్రమ కేసులకు తావులేకుండా శాంతిభద్రతలను కాపాడాలన్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలని, అయితే ఎలాంటి తప్పు చేయని అమాయకులు, పేద ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ భవనాలు వంటి అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతుందని, వాటిని సక్రమంగా నిర్వహించి సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఖమ్మం ప్రజలపైనే ఉందని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.















