ఈతరంభారతం కూసుమంచి జూలై 13 : ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువ అండర్ టన్నెల్ ( యూటీ) నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేసి రేపటి (సోమవారం )నుంచి 1500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం 10గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో జరుగుతున్న పాలేరు సాగర్ కాలువ పనులను జిల్లా కలెక్టరు అనుదీప్ దురిశెట్టి తో కలిసి మంత్రి ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్లో పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జుజ్జులరావు పేట సమీపంలో పాలేరు రిజర్వాయర్ దగ్గర ప్రధాన కాలువపై అండర్ టన్నెల్ ( యూటీ) కొట్టుకపోయిందన్నారు.















