ఈతరం భారతం ఖమ్మం జూలై 23 : కారేపల్లి మండల వ్యవసాయ అధికారి బట్టు అశోక్ కు తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం విధుల్లో భాగంగా చీమలపాడు వైపు వెళ్తుండగా మండల పరిధిలోని చర్లపల్లి – చీమలపాడు రోడ్డులో రైల్వే అండర్ బ్రిడ్జి లో నీరు నిలవడంతో కారు మునిగింది.
చర్లపల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిల్వ తక్కువగా కనిపించడంతో లోతు గమనించకుండా ముందుకు సాగారు. మొదట నీరు తక్కువగా కనిపించడం తో కారుతో నేరుగా బ్రిడ్జి లోకి వెళ్లారు. అనూహ్యంగా నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో కారుతో సహా వ్యవసాయ అధికారి నీటిలో మునిగిపోయారు.
అదృష్టవశాత్తు ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న రైతులు స్పందించి వెంటనే ఆయనను బయటకు తీసుకువచ్చి ప్రాణాపాయాన్ని తప్పించగలిగారు. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. వర్షాకాలంలో అండర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలవడం వల్ల తరచు ప్రమాదంగా మారిపోతుందని, దీనిపై రైల్వే శాఖ చొరవ చూపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రతి అండర్ బ్రిడ్జి వద్ద నీరు తొలగించే మోటార్లు ఏర్పాటు చేయడంతో పాటు, జాగ్రత్త చర్యల్లో భాగంగా పహారా సిబ్బంది ఉండేలా చూడాలని, మీరు ఎంత లోతు నిల్వ ఉందో సూచిక బోర్డులు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.















