ఈతరం భారతం నాగర్ కర్నూలు సెప్టెంబర్ 17:
_____________________________________
నల్లమల అడవుల్లో 622 ఏళ్ల నాటి అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమెల్ల గ్రామ పరిధిలోని అడవిలో శిథిలమైన శివాలయం ముందు ఉన్న శాసనఫలకాన్ని విజయవాడకు చెందిన కార్తీక్ పోతుబోయిన గుర్తించారు. నల్లమలలో క్షేత్రాలు, శాసనాలు, చరిత్రను అన్వేషిస్తున్న వేదాద్రి నల్లగొర్ల ట్రెక్కింగ్ బృందం సభ్యులతో కలిసి ఆయన ఈ శాసనాన్ని పరిశీలించారు. నల్లగొర్ల వేదాద్రి, ఎం. శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, విష్ణు కూడా పరిశోధనలో పాల్గొన్నారు. శాసనాన్ని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. శాసనంలో మణినాగపురవరేశ్వరుడు, హారీతిగోత్రానికి చెందినమాధవవర్మ వంశ ప్రస్తావనతో పాటు మల్లిదేవరాజు, ఆయన కుమారుడు త్రిపురరాజుల పేర్లు ఉన్నాయి. శాసనంలోని శక సంవత్సరం విషయంలో పొరపాటు ఉన్నప్పటికీ ‘తారణ’ సంవత్సరం, పౌష్య శుద్ధ దశమి, శుక్రవారం, ఉత్తరాయణ సంక్రమణ వివరాల ఆధారంగా తేదీని 1404 డిసెంబర్ 14గా గుర్తించారు. ఉడుమీశ్వర దేవాలయంలో ధూప, దీప, నైవేద్యాల నిర్వహణ కోసం విశాలాక్షి జియ్యేలు చేసిన దానాన్ని శాసనంలో నమోదు చేశారు. మల్లిదేవరాజు పేరుతో ఆమనగల్లు రామలింగేశ్వరస్వామి గుట్టపై లభించిన శాసనంతో దీనికి పోలికలు ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ శాసనం నల్లమల చరిత్రకు ముఖ్య ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.















