యాదగిరిగుట్ట ,జూలై 24:(ఈతరం భారతం); రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని.. ప్రజాభిమానం చూరగొంటున్న ప్రజా పాలన సజావుగా కొనసాగేలా ఆశీర్వదించు స్వామి… అని శ్రీ కాలభైరవ స్వామి దేవుడిని కోరుకున్నట్లు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. శ్రీ శనీశ్వర దేవుని కుమారుడైన శ్రీ మాందేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన అమావాస్య రోజున శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవడం మహద్భాగ్యమని ఆయన అన్నారు. గత 15 సంవత్సరాల కాలంగా యాదిగిరి గుట్టకు కేవలం మూడు కిలోమీటర్ల సమీపంలో గోసేవ ఆశ్రమాన్ని స్థాపించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అందిస్తున్న శ్రీ బోధానందగిరి స్వామి సేవలను ఆయన కొనియాడారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులతో ఆశ్రమంలోని శ్రీ కాలభైరవ దేవాలయం తో పాటు చేరువలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. దురలవాట్లను, చెడు వ్యసనాలను త్యజించేందుకు వారంలో ఒక్కరోజైనా దేవాలయాన్ని సందర్శిస్తే మార్పు కనిపిస్తుందని ఐలయ్య అన్నారు.















