ప్రజా పండుగ ” రజా”
ఒరిస్సా ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగల లో రజా పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం సూర్యుడు జేస్ట మాసంలో మిధున రాశిలో ప్రవేశించే రోజున ఈ పండుగను మొదలుపెడతారు. వరుసగా నాలుగు రోజులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మొదటిరోజు పహలిరజా, రెండవ రోజు మిధున సంక్రాంతి మూడవరోజు బహుదః లేదా బసీ ర జ చివరి రోజు వసుమతి స్నానం అని పిలుస్తారు .
రాజా అనేది రజస్వల కి సంక్షిప్తపదం. ఈ పండుగను జగన్నాథుని భార్య భూదేవి రుతు చక్రమునకు ప్రతీకగా జరుపుకుంటారు. ఏడాదికి ఒకసారి ఈ రోజులలో భూదేవి మహిళ పడుతుందని అందుకే ఈ రోజుల్లో ఎలాంటి వ్యవసాయ పనులు భూదేవికి బాధ కలిగించే పనులు చేయకూడదని పండుగ నియమం. ఈ సమయంలో రుబ్బురోలును భూదేవికి ప్రతీక గా కొలుస్తారు. మొదటి రోజుకు ముందు రోజు ను సాజ బాజా అని పిలుస్తారు. ఆరోజు వంట ఇంటిని రుబ్బురోలు శుభ్రపరుస్తారు. నాలుగవ రోజు వసుమతి స్నానం చేస్తారు. స్త్రీలందరూ తల స్నానం చేసి శరీరానికి పసుపు రాసుకుని రుబ్బురోలు భూమాతగా భావించి దానికి పసుపు సింధూరం పూలు అలంకరించి పండ్లను నైవేద్యంగా పెడతారు. మొదటి రోజు నుండి మూడవ రోజు వరకు ఇంట్లో స్త్రీలు భూదేవి రుతు చక్రం కారణంగా మైల తోనే ఉండి స్నానం చేయరు. వంటింట్లోకి వెళ్ళ రు. ఇంటి బయట ఉంటారు. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. వయసులో ఉన్న ఆడపిల్లలు కొత్త దుస్తులతో ప్రతి ఊరిలో ఊయలలు ఊగుతూ సరదాగా గడుపుతారు. పెద్దవారు బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. మగవారు వంట పనిలో నిమగ్నమై రుచికరమైన పదార్థాలను వండి పెడతారు. పండ్లతోపాటు స్త్రీలకు వీటిని తినిపిస్తారు. స్త్రీలు భూదేవికి శ్రమ కలగ కుండా అరటి బెరడు పాదరక్షలు గా ధరించి నెమ్మదిగా అడుగులు వేస్తారు.
ఈ పండుగ రోజుల్లో స్త్రీలు పన్నా అనే పానీయం తాగుతారు. దీన్ని పెరుగు కొబ్బరి నీళ్లు బెల్లం సువాసన ద్రవ్యాలు కలిపి తయారుచేస్తారు. జూన్ నెలలో వచ్చే ఈ పండుగ వేసవికాలంలో అనుసరించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలను గుర్తు చేస్తుంది.















