ఈతరం భారతం వికారాబాద్ జులై 23 :
పెద్ద వయసు వారిలో “పడిపోవడం” పెద్ద సమస్య! మెట్ల మీద, స్నానాల గదిలో నునుపుగా ఉండే బండల మీద ఇలా ఎక్కడో చోట వృద్ధులు జారి పడిపోవడం, ఎముకలు విరగటం ముఖ్యంగా తుంటి కిలు విరిగి వారి జీవితం ఉన్నట్టుండి సమస్యల వలయముగా మారిపోవటం తరచూ చూస్తుంటాము. పైగా ఈ వయసుకు వచ్చేసరికి చాలామందికి ఎముకలు బోలుగా తయారై (ఆస్తియోపోరోసిస్) అవి తేలికగా కొద్దిపాటి ఒత్తిడికే విరిగిపోతుంటాయి. తర్వాత త్వరగా అతుకవు కూడా! దీనివల్ల కొన్నిసార్లు మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితులు కూడాతలెత్తుతుంటాయి. వీటన్నిటికీ కారణం గా మలి వయసులో జారిపడటం, తుంటి ఎముక విరగటం అన్నది అతి పెద్ద వృద్ధాప్య సమస్యల తయారవుతుంది. కాబట్టి అసలీ విపత్తు తలెత్తకుండా చూసుకోవటమే మేలు. ఇంట్లో వృద్ధులు ఉన్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు అవసరమని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి సొసైటీ పేర్కొన్నారు. ఆ జాగ్రత్తలేమిటో సాయి చౌదరి మాటలలోనే తెలుసుకుందాం
ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వైర్లు, తాళ్లు, బట్టలు వంటివి పడేసి ఉంటే అవి కాళ్లకు అడ్డుపడి వృద్ధులు పడిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వైర్లు, తాళ్ళ వంటి వాటిని అన్నింటినీ నిర్లక్ష్యముగా నేల మీద వదిలేయకుండా జాగ్రత్తగా ఒక చోట చుట్టి పెట్టటం ముఖ్యం.స్నానాల గదిలో “నాన్ స్కిడ్ టైల్స్” ని వాడాలి. దీని వల్ల అక్కడ పాకుడు పట్టడం, జారిపోవడం వంటి సమస్యలు ఉండవు.
చాలామంది ఇంట్లో సాక్స్ లు ధరించి నడుస్తుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. నునుపైనా నేల మీద అవి తేలిగ్గా జారిపోతుంటాయి. రబ్బరు సోలు ఉన్న పాదరక్షలు ధరించడం మంచిది. అవి అంతగా జారిపోయే అవకాశం ఉండదు. చాలాసార్లు పక్క మీంచి లేచేటప్పుడు దుప్పట్లు కాళ్లకు చుట్టుకుని పడిపోతుంటారు. కాబట్టి హడావుడిగా లేవకుండా… దుప్పట్లును జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి అప్పుడు నిదానంగా లేచి కూర్చుని, అప్పుడు నిలబడటం అలవాటు చేసుకోవాలి.
వృద్ధులు తరచూ ఉపయోగించే మందుల వంటి వాటిని ఎక్కడో అందనంత ఎత్తులో పెట్టుకోవద్దు. స్టూలు వేసుకుని వాటిని అందుకునే క్రమంలో వాళ్లు పైనుంచి పడిపోవచ్చు. ఒకవేళ పొరపాటున నీళ్ల లాంటివి ఇంట్లో నేల మీద ఉనికి పోతే అవే ఆరిపోతాయి లే అనే నిర్లక్ష్యము పనికిరాదు. మార్బుల్స్, గచ్చు మీద జారీ పడితే గాయాలు తీవ్రంగా ఉండే ప్రమాదముంది
చాలా ఇళ్లల్లో మెట్ల ప్రాంతము చీకటిగా ఉంటుంది. గదుల్లో తప్పించి మెట్ల దగ్గర ప్రత్యేకించి లైట్లేమి ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పెద్దవాళ్లు రాత్రి పూట నిద్రమత్తులో పొరపాటున ఒకచోట అడుగు వేయబోయి మరోచోట వేస్తుంటారు. దీంతో జారిపడే గాయాల పాలవుతుంటారు. కాబట్టి మెట్ల దగ్గర మంచి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. బద్ధక్కించకుండా లైట్ వేసుకుని మెట్ల మీద నడవాలి.
కొన్నిసార్లు మనం వాడే మందులు కూడా మగతకు కారణం అవుతాయి. అవి కూడా ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. కనుక వైద్యులు మగతగా ఉండని మందులు సిఫార్సు చేయమని కోరాలి. వృద్ధులు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా అవసరం. ఇంట్లో పెంపుడు కుక్కలు, పిల్లలు కూడా చాలాసార్లు దారిలో అడ్డంగా పడుకొని ఉంటాయి. పెద్దవాళ్ళు వీటిని చూడక కాలు తగిలి పడిపోతుంటారు. కాబట్టి పెంపుడు జంతువులకు ఇంట్లో ఏదో ఒక పక్కగా పడుకోవటం అలవాటు చేయాలి అని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు.















