ఈతరం భారతం వరంగల్, జనవరి 26
మేడారంలో గద్దెల ప్రాంగణంపై హెలికాప్టర్ చక్కర్లు వద్దని దేవాదాయ శాఖ వారించినా వినని దయనీయస్థితి నెలకొన్నది. మేడారం జాతర నిర్వహణలో శాఖల మధ్య సమన్వయలోపానికి హెలీకాప్టర్ రైడ్ మచ్చుతునకగా నిలిచింది. మేడారంలో 2016 నుంచి హెలీకాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి మేడారంలోని సమక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం, చిలుకలగుట్టపైకి వెళ్లకూడదని మేడారం వడ్డెలు (పూజారులు), ఆదివాసీ ప్రతినిధులు ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈసారి ఆ ఆనవాయితీ తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హనుమకొండ, ములుగు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ ‘తంబీ హెలీసంస్థ’తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా గురువారం నుంచి ఈ నెల 31 భక్తుల సేవలో రెండు హెలీకాప్లర్టు అందుబాటులోకి తెచ్చారు. హెలీరైడ్ ద్వారా మేడారం జాతర పరిసరాలను గగన వీక్షణ చేస్తున్నారు. గద్దెల ప్రాంగణం, చిలుకలగుట్ట పై నుంచి హెలీకాప్టర్ చక్కర్లు కొట్టొద్దని ఎంత వారించినా వినడంలేదని ఆదివాసీలు, పూజారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తల్లుల గద్దెలమీది నుంచి ఆ హెలీకాప్టర్ చక్కర్లు కొట్టొద్దని చెప్పండి’ అని దేవాదాయ శాఖ అధికారులు ‘సెట్’లో పలుమార్లు చెప్పినా ఫలితం లేకుండా పోతున్నది.














