EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సోషల్ మీడియా రీల్స్.. సెక్రటేరియట్ వద్ద బైక్ స్టంట్స్ చేసిన ఇద్దరి అరెస్ట్

ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 24

సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం కక్కుర్తి పడి, రోడ్లపై ప్రమాదకర రీతిలో బైక్ స్టంట్లు చేస్తున్న ఇద్దరు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సెక్రటేరియట్, లుంబినీ పార్క్ పరిసరాల్లో వీరు చేసిన నిర్వాకం వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు యువకులు లుంబినీ పార్క్, సెక్రటేరియట్ సమీపంలోని రద్దీగా ఉండే రోడ్లపై తమ బైక్‌లతో ప్రమాదకర విన్యాసాలకు (స్టంట్లు) పాల్పడ్డారు. వీరి బాధ్యతారహితమైన చర్యల వల్ల సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగడమే కాకుండా, ప్రాణహాని కలిగే పరిస్థితులు తలెత్తాయి. దీనిపై పక్కా సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు, నిరంతర నిఘా ఉంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వివరాలు..

మహ్మద్ అఖీల్ (19) వృత్తిరీత్యా కొరియర్ బాయ్, ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్‌ ప్రాంతానికి చెందినవాడు. మహ్మద్ అతీక్ (22) ప్రైవేటు ఉద్యోగి, నాంపల్లిలోని అఘాపురాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. వీరు స్టంట్లు చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిళ్లను, వీడియోలు రికార్డ్ చేసిన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం (సీజ్) చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఖైరతాబాద్ జోన్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో (SHO) ఎ. సీతయ్య పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో.. విచారణ అధికారి (IO) వి. పరమేశ్వరి, పోలీసు సిబ్బంది ఎల్. సంపత్ కుమార్, బి. విజయ్ కుమార్, జె. లింగస్వామి, ఎస్. మహేష్ చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.

పోలీసుల తీవ్ర హెచ్చరిక..

‘ప్రజా భద్రతకు విఘాతం కలిగిస్తూ, రోడ్లపై ప్రమాదకర విన్యాసాలకు (స్టంట్లు, రేసింగ్) పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది’ అని సైఫాబాద్ ఎస్‌హెచ్‌వో హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top