ఈతరం భారతం తిరుపతి మార్చ్ 31
తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజారెడ్డినగర్లో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి కుమార్తె ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె తన ఫోన్లో సోషల్ మీడియా కోసం వీడియో రీల్స్ చేస్తోంది. అజాగ్రత్తగా ఉండటంతో ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.మరణించిన బాలిక వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిది నేపాల్ దేశానికి చెందిన కుటుంబం కాగా, బతుకుదెరువు కోసం తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇలా క్షణకాలం పాటు చేసిన పొరపాటు వల్ల చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో వ్యూస్ మరియు లైకుల కోసం ప్రమాదకరమైన ప్రదేశాలలో వీడియోలు తీయడం ప్రాణాల మీదకు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సరదా కోసం చేసే పనులు ఇలా నిండు ప్రాణాలను బలి తీసుకోవడం చాలా బాధాకరం.














