ఈతరం భారతం అదిలాబాద్ మే 8
తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తుమ్మిడిహెట్టి ద్వారా ఉత్తర తెలంగాణలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును పునరుద్ధరించే చర్యలు చేపడుతున్నామని వారు వెల్లడించారు.
శుక్రవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి తుమ్మిడిహెట్టిని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాణహిత నదికి మంత్రులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరుతో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్ది, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా తుమ్మిడిహెట్టి వద్ద పనులు ప్రారంభిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సహజ సిద్ధమైన నీటి లభ్యత ఉన్న చోట నిర్మించాల్సి ఉండగా, గత ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం దానిని పక్కనపెట్టిందని మంత్రులు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజా ధనం వృధా అయిందని, కానీ తుమ్మిడిహెట్టి ద్వారా నీటిని మళ్లిస్తే ఆ ప్రాంత రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు పేర్కొన్నారు. 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.














