ఈతరం భారతం సంస్థాన్ నారాయణపురం మే 16
నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గ్యాస్ కోసం వినియోగదారులు రోడెక్కారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ (భారత్ గ్యాస్) ఏజెన్సీ.. గత కొన్ని నెలలుగా వినియోగదారులు గ్యాస్ ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నా సరఫరాలో తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో వారు శనివారం గ్యాస్ ఏజెన్సీని ముట్టడించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీల అంతర్గత విభేదాల కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఏజెన్సీ వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నా సిలిండర్ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వినియోగదారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.














