EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం :   జిల్లా కలెక్టర్ అంకిత్

ఈ తరం భారతం భద్రాద్రి కొత్తగూడెం / రిపోర్టర్ / యం డి. షఫీ యు జమ : మే. 16

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన 167 కొనుగోలు కేంద్రాలకు 167 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి జాప్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, తార్పాలిన్లు, తూకం యంత్రాలు, హమాలీలు, రవాణా సదుపాయాలు తదితర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రైతులు తీసుకువచ్చే ధాన్యం, మొక్కజొన్నను వేగవంతంగా కొనుగోలు చేసి వెంటనే నిల్వ కేంద్రాలకు తరలించే విధంగా సమన్వయ చర్యలు చేపట్టామని తెలిపారు.

జిల్లాలో మొత్తం 94,198 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా, సుమారు 2,44,915 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేయబడిందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున రైతులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి 94,822 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 11 కొనుగోలు కేంద్రాల ద్వారా 32,546.350 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

కొనుగోలు చేసిన మొక్కజొన్నలో 19,595.350 మెట్రిక్ టన్నులను ఇప్పటికే గోదాములకు తరలించామని, మిగిలిన 12,951 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కూడా త్వరితగతిన తరలించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోకుండా అవసరమైన రవాణా సౌకర్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటూ నిరంతర లోడింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో గన్నీ సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా 6,50,927 గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. మొక్కజొన్న నిల్వ కోసం జిల్లాలోని కొదాడ, బాదలాపురం, మత్తంపల్లి, కుక్కడాం, కరేపల్లి, యెల్లందు, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి తదితర ప్రాంతాల్లోని శాస్త్రీయ గోదాములను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 41,814 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాముల్లో ప్రస్తుతం 19,622 మెట్రిక్ టన్నుల స్థలం వినియోగంలో ఉండగా, ఇంకా 22,192 మెట్రిక్ టన్నుల ఖాళీ నిల్వ స్థలం అందుబాటులో ఉందన్నారు. ధాన్యం తేమ శాతం, తరుగు తదితర అంశాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా రైస్ మిల్లర్లు తరుగు పేరుతో అనవసర కోతలు విధించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో అధిక స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదవుతున్న నేపథ్యంలో నిల్వల కోసం ప్రత్యామ్నాయ స్థలాలను కూడా ప్రత్యేకంగా గుర్తించి సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అందుబాటులో ఉన్న ఫంక్షన్ హాళ్లు, గోదాములు, పాఠశాల భవనాలను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగిస్తూ లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు .

రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే సంబంధిత ప్రత్యేక అధికారులకు లేదా జిల్లా అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఆరుగాలంశ్రమించి పండించిన రైతుల పంటను ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top