ఈతరం భారతం హైద్రాబాద్ జులై 10;
వరంగల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు రాజనాల శ్రీహరి జనసేన వైపు అడుగులు వేస్తున్నారా..?అంటే అవును అనే సమాధానం వస్తుంది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.వరంగల్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు రాజనాల శ్రీహరి శుక్రవారం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో చేరికకు సంబంధించిన అంశాలతో పాటు తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి ఆధ్వర్యంలో ఈ కీలక భేటీ జరిగింది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, పార్టీ విస్తరణతో పాటు రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.ఈ భేటీ సందర్భంగా రాజనాల శ్రీహరి, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పవన్ కళ్యాణ్ కు బహూకరించారు. అనంతరం తెలంగాణ రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేకంగా చర్చించారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడుతున్నట్లు తాజా పరిణామాలు సంకేతాలిస్తున్నాయి. రాజనాల శ్రీహరి జనసేనలో చేరితే వరంగల్‌తో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.మొత్తానికి… రాజనాల శ్రీహరి చూపు జనసేన వైపు మళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన జనసేనలో చేరిక తెలంగాణ కాంగ్రెస్‌కు రాజకీయంగా భారీ షాక్‌గా మారే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సమావేశంలో జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ బొంగునూరి మహేందర్ రెడ్డి ,తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ , గ్రేటర్ హైదరాబాద్ నాయకులు రాధారం రాజలింగం తెలంగాణ ప్రచార కార్యదర్శి సాగర్ , తెలంగాణ రాష్ట్ర నాయకులు తనీష్ మచ్చ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..















